టీడీపీ ప్ర‌చార ర‌థాన్ని కూడా వ‌ద‌ల్లేదుగా!!

Update: 2023-01-04 12:55 GMT
ఏపీ వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను ఎంతగా వేధించాలో .. అంతా వేధిస్తోంద‌ని అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు  . ముఖ్యంగా టీడీపీ విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి తీవ్ర వివాదానికి, విమ‌ర్శ‌ల‌కు కూడా తావిస్తోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో మూడు రోజుల పాటు ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించుకు న్నారు. అయితే.. దీనికి అడుగ‌డుగునా ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

కొత్త సంవ‌త్స‌రంలో కొత్త‌గా తెచ్చిన జీవో 1/2023 ద్వారా రోడ్డు కూడ‌ళ్ల‌లో బ‌హిరంగ స‌భ‌ల‌కు, రోడ్ షోల‌కు అనుమ‌తి లేకుండా చేసిన ప్ర‌భుత్వం.. క‌నీసం ప్ర‌చార ర‌థాన్ని కూడా వ‌దిలి పెట్ట‌లేదు. కుప్పం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం చంద్ర‌బాబు శాంతిపు రంలో ప‌ర్య‌టించాల్సి ఉంది. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తో ఆయ‌న భేటీ కావాల్సి ఉంది. అయితే.. ఈప ర్య‌ట‌న కోసం.. పార్టీ నాయ‌కులు ప్ర‌చార‌రథాన్ని సిద్ధం చేశారు. టీడీపీ జెండాలు, నినాదాల‌తో రూపొందించిన ఫ్లెక్సీలు క‌ట్టి.. ప్ర‌చార ర‌థాన్ని రెడీ చేసిన విష‌యం తెలుసుకున్న పోలీసులు.. ర‌హ‌దారిపైకి వాహ‌నం రాగానే దానిని నిలుపుద‌ల చేశారు.

అనుమ‌తి లేద‌ని పేర్కొంటూ.. ప్ర‌చార వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. వాహ‌నం డ్రైవ‌ర్‌ను కూడా అదుపులో కి తీసుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ ప‌రిణామాల‌తో ఒక్క‌సారిగా టీడీపీ శ్రేణులు భ‌గ్గుమ‌న్నాయి. ఈ క్ర‌మంలో శాంతి పురంలో ధ‌ర్నాకుదిగాయి. ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

అయితే, పోలీసులు వీరిపై లాఠీల‌తో విరుచుకుప డ్డారు. దొరికిన వారిని దొరికిన‌ట్టు బాదేశారు. ఈ లాఠీ చార్జ్‌లో దాదాపు 10 మంది వ‌ర‌కు కార్య‌క‌ర్త‌లు గాయ‌ప‌డ్డారు. ప‌లువురు మ‌హిళ‌ల‌కు కూడా గాయాల‌య్యాయి.

మ‌రోవైపు.. పార్టీ కార్య‌క్ర‌మాలకు మంగ‌ళ‌వార‌మే అనుమ‌తి కోరామ‌ని, దీనికి పోలీసులు అనుమ‌తి ఇచ్చార‌ని టీడీపీ నాయ‌కులు తెలిపారు. అంతేకాదు.. ప్ర‌చార ర‌థానికి కూడా అనుమ‌తి ఉంద‌ని చెప్పారు. దీనికి సంబంధించిన ప‌త్రాల‌ను కూడా పోలీసులకు చూపించారు అయిన‌ప్ప‌టికీ.. పైనుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ని.. ఎలాంటి అనుమ‌తి లేద‌ని.. పోలీసులు తేల్చి చెప్పారు. వెంట‌నే వారందిరినీ అక్క‌డ నుంచి త‌రిమి కొట్టారు. ఇక‌, ఈ ప‌రిణామాల‌పై కుప్పం చేరుకున్న చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌భుత్వం పిరికి ప్ర‌భుత్వం అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News