వార‌సులు దూసుకొచ్చేస్తున్నారహో!

Update: 2018-02-26 01:44 GMT
తెలుగు నేల రాజ‌కీయాల్లో ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఈ త‌ర‌హా చ‌ర్చ వ‌చ్చినా.. అప్పుడంత పెద్ద‌గా దీనిపై చ‌ర్చ జ‌రగ‌లేద‌నే చెప్పాలి. అయితే ఇప్పుడు మాత్రం ఎక్క‌డ చూసినా దీనిపైనే చ‌ర్చ జ‌రుగుతోంది. అదే వార‌స‌త్వ రాజ‌కీయం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ల వార‌సులు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతుండ‌గా - వారి త‌ల్లిదండ్రులు కూడా ఇక త‌మ కాలం అయిపోయింద‌ని - వార‌సులను రంగంలోకి దించ‌క‌పోతే... మొత్తంగా తెర‌మ‌రుగు అయిపోవ‌డం ఖాయ‌మేన‌న్న కోణంలో చాలా వేగంగానే పావులు క‌దుపుతున్నారు. 2009 ఎన్నికల్లోనే నాటి ఉమ్మ‌డి రాష్ట్ర సీఎంగా ఉన్న దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చాలా గ్రాండ్‌ గా ఎంట్రీ ఇచ్చారు. క‌డ‌ప పార్ల‌మెంటు స్థానం నుంచి బ‌రిలోకి దిగిన జ‌గ‌న్‌.... తండ్రిలాగే బంప‌ర్ మెజారిటీతో పార్ల‌మెంటులో అడుగుపెట్టారు. ఇక గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనూ కొన్ని కొత్త ముఖాలు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశాయి.

అలాంటి వాటిలో తెలంగాణ‌లోని సిరిసిల్ల అసెంబ్లీ నుంచి టీఆర్ ఎస్ అధినేత త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు - నిజామాబాదు లోక్ స‌భ స్థానం నుంచి కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ - క‌డ‌ప జిల్లా రాజంపేట లోక్ స‌భ స్థానం నుంచి మాజీ మంత్రి - పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి - గుంటూరు పార్ల‌మెంటు స్థానం నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్ ల‌ను చెప్పుకోవాలి. వీరంతా తొలి య‌త్నంలోనే విజ‌యం చేజిక్కించుకుని అటు పార్ల‌మెంటులో - ఇటు అసెంబ్లీలో త‌మ‌దైన శైలిలో స‌త్తా చాటుతున్నారు. ఇక టీడీపీ తొలి త‌రం నేత‌ - మాజీ ఎంపీ కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు హ‌ఠాన్మ‌ర‌ణంతో ఆయ‌న కుమారుడు రామ్మోహ‌న్ నాయుడి ఎంట్రీ కూడా అదిరిపోయింద‌నే చెప్పాలి. వీరంద‌రి ఎంట్రీ బాగానే ఉన్నా... టీడీపీ అధినేత‌గానే కాకుండా ఏపీకి సీఎంగా ఉన్న నారా చంద్ర‌బాబునాయుడు పుత్ర‌ర‌త్నం నారా లోకేశ్ ఎంట్రీనే చాలా విచిత్రంగా జ‌రిగిపోయింది. ఓ కీల‌క రాజ‌కీయ‌వేత్త కుమారుడిగా ఉన్న లోకేశ్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల ద్వారా కాకుండా ప‌రోక్ష ఎన్నిక‌ల ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. దీనిపై అన్ని వైపుల నుంచి కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఇదంతా గ‌తం అనుకుంటే... ఇప్పుడు తెలుగు నేల‌లో చాలా మంది రాజ‌కీయ నేత‌లు త‌మ వార‌సుల‌ను పాలిటిక్స్ లోకి దించేసేందుకు ప‌క్కా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏపీలో అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కుమారుడు ప‌వ‌న్ - మంత్రి ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీ‌రామ్‌ - రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్ కుమారుడు టీజీ భ‌ర‌త్‌ - విజ్ఞాన్ విద్యా సంస్థ‌ల అధినేత లావు ర‌త్త‌య్య కుమారుడు లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు ఇప్ప‌టికే రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశానికి రంగం సిద్ధ‌మైపోయింద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ‌కు సంబంధించి మ‌రికొన్ని కొత్త ముఖాలు తెర‌పైకి వ‌చ్చాయి. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి డీకే అరుణ త‌న ఇద్ద‌రు కూతుళ్లు శృతి - స్నిగ్థ‌ల‌ను రాజ‌కీయాల్లోకి దించేందుకు డీకే ఫ్యామిలీ దాదాపుగా నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. గ‌ద్వాల నుంచి చిన్న కూతురు స్నిగ్ధ‌ను - మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండో కుమార్తె శృతిని రంగంలోకి దించుతున్నార‌ట‌. ఇక ఇదే జిల్లాకు చెందిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు త‌న కుమారుడు అరుణ్‌ ను వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలో నిలిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని వినికిడి. ఇప్ప‌టికే పార్టీ వ్య‌వ‌హారాల ప‌రంగా ఎంట్రి ఇచ్చిన అరుణ్‌... ఏకంగా వ‌న‌ప‌ర్తి జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకుని మ‌రీ ఇప్ప‌టి నుంచే త‌న గ్రాండ్ ఎంట్రీకి క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టార‌ట‌.

అదే విధంగా దేవరకద్ర, మక్తల్‌ నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు సీతమ్మ - దయాకర్‌ రెడ్డి దంపతల పెద్ద కుమారుడు సిద్దార్థరెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని ఆశపడుతున్నారు. అయితే వారు ప్రస్తుతం కొనసాగుతున్న టీడీపీ పరిస్థితి నానాటికి దయనీయంగా మారుతోంది. ప్రస్తుత టీడీపీ ద్వారా కుమారుడిని బరిలో దింపితే ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుమారుడి రాజకీయ ప్రస్థానాన్ని ఎక్కడ ప్రారంభించాలో అర్థం కాక సతమతమవుతున్నారు. ఇక ఇదే జిల్లాకు చెందిన మహబూబ్‌ నగర్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి మొదటి కుమారుడు సిద్దార్థరెడ్డి సైతం రాజకీయ అరగ్రేటం కోసం ఉవ్విలూరుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆయన తెరపైకి రాకపోయినా వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌ నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏదైనా ఒక అసెంబ్లీ స్థానానికి ఒక చోట పోటీకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఒకటి - రెండు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక గ‌డ‌చిన ఎన్నికల్లోనే ఎంట్రీ ఇచ్చిన మాజీ మంత్రి నాగం జ‌నార్థ‌న్ రెడ్డి కుమారుడు శ‌శిధ‌ర్ రెడ్డి బ‌రిలోకి దిగారు. అయితే అనూహ్యంగా ఆయ‌న ఓట‌మిపాలు కాగా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా త‌న కుమారుడిని చ‌ట్ట‌స‌భ‌కు పంపేందుకు నాగం తీవ్రంగానే య‌త్నిస్తున్నట్లు వినికిడి. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలానే ఉంద‌న్న వాద‌న లేక‌పోలేదు. మ‌రి ఎంత‌మంది కొత్త నేత‌లు బ‌రిలోకి దిగుతారో, ఎంత‌మంది విజ‌యం సాధించి స‌త్తా చాటుతారో చూడాలి.
Tags:    

Similar News