మా ఆవిడ కాదు పోటీ చేసేది నేనే: భార్యతో విభేదాలపై వైసీపీ ఎమ్మెల్సీ క్లారిటీ!

Update: 2023-04-06 10:54 GMT
శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో ఒకటి.. టెక్కలి. ఇక్కడి నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అచ్చెన్నాయుడిని ఓడించాలని వైసీపీ అధినేత జగన్‌ గట్టిగానే ప్రయత్నించారు. అయితే అచ్చెన్నను ఓడించలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా ఆయనను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ ను జగన్‌ అభ్యర్థిగా ప్రకటించారు.

అయితే దువ్వాడ శ్రీనివాస్‌ భార్య వాణి ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్నారు. తన భర్తతో ఆమెకు విభేదాలున్నాయని.. ఈ నేపథ్యంలో వైసీపీ ముఖ్య నేతలను కలసి టెక్కలి అసెంబ్లీ సీటు తనకే ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ దీనిపై వివరణ ఇచ్చారు. తన భర్త అడుగుజాడల్లోనే తాను నడుస్తానని.. టెక్కలిలో వైసీపీ బలంగా ఉండటంతో.. కావాలనే రూమర్స్‌ ను కొంతమంది సృష్టిస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి ఆరోపించారు.

కాగా గతంలో దువ్వాడ శ్రీనివాస్‌ శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ గా పనిచేశారు. 2009లో కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. టెక్కలి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ నుంచి టెక్కలి నుంచి పోటీ చేసినా మరోసారి ఓటమే ఎదురైంది. 2019లో వైసీపీ అభ్యర్థికి శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే శ్రీకాకుళం జిల్లా దివంగత ఎర్రంనాయుడు కుటుంబానికి కంచుకోట కావడం, ఆయన తనయుడితోపాటు తమ్ముడు అచ్చెన్నాయుడు వరుస విజయాలు సాధిస్తుండటంతో వారిని అడ్డుకోవడానికి జగన్‌.. దువ్వాడకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టారు. అందుకు తగ్గట్టే దువ్వాడ కూడా ప్రతిపక్ష నేతలపై ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్‌ నే జగన్‌ ఖరారు చేశారు. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన 100 మంది కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించిన జగన్‌.. దువ్వాడను గెలిపించాలని సూచించారు.

ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి స్పందించి తమ మధ్య అలాంటిదేమీ లేదని స్పష్టతనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో ఎగిరేది వైసీపీ జెండాయేనని తేల్చిచెప్పారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News