82 ఏళ్ల వయసులో నాన్సీ పెలోసీ రాజకీయ సంచలనం ఎలా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Update: 2022-08-04 04:53 GMT
అమెరికాలోని అధికార పార్టీ నేతల్లో నెంబర్ 3గా వ్యవహరించే అమెరికా ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసీ ఇప్పుడెంత హాట్ టాపిక్ గా మారారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 82 ఏళ్ల పెద్ద వయసులో ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు.. మూర్ఖత్వంగా అభివర్ణిస్తున్న మొండితనం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. ఆమె తీరుపై బోలెడంత చర్చ నడుస్తోంది. రెండు అగ్రదేశాల మధ్య మంట మరింత రాజుకునేలా ఆమె తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం.. ప్రపంచ గమనాన్ని ఏదో ఒక దశలో ప్రభావితం చేయటం ఖాయమన్న సంగతి తెలిసిందే.

ఇంతకూ నాన్సీ పెలోసీ ఎవరు? ఆమె తాజాగా చేసిన తైవాన్ పర్యటన ఎలాంటి పరిణామాలకు కారణం కానుంది? ఆమె అంత టప్ ఉమెన్ ఎలా అయ్యారు? చైనా లాంటి దేశానికి మింగుడుపడని రీతిలో.. ఆ దేశం ఇచ్చిన వార్నింగ్ ను పిచ్చ లైట్ అన్నట్లుగా తీసుకొని.. తాను ఒకసారి డిసైడ్ అయ్యాక.. ఎవరూ తన నిర్ణయాన్ని మార్చలేరన్న మొండితనాన్ని ప్రదర్శిస్తూ.. డ్రాగన్ బెదిరింపుల్ని అస్సలు లక్ష్య పెట్టక.. పాతికేళ్ల విరామం తర్వాత అమెరికాకు చెందిన కీలక నేత తైవాన్ లో పర్యటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందునా.. ఒక పెద్ద వయసున్న మహిళ.. అధికారికంగా కాకుండా అనధికారికంగా పర్యటించి రావటం చాలామందికి మింగుడుపడనిదిగా మారింది.

ఇంతకూ ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. 1940 మార్చి 26న మేరి ల్యాండ్ లోని బాల్టిమోర్ లో ఆమె జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఇటాలియన్ అమెరికాన్లు కావటం గమనార్హం. ఆరుగురు అన్నత తర్వాత ఏకైక కుమార్తెగా ఆమె ఉండేది. ఆమె తండ్రి రాజకీయ నేపథ్యం ఉన్న వారు. ఆమె తండ్రి థామస్ డి అలెగ్జాండ్రో బాల్టిమోర్ కు మేయరర్ గా పని చేశారు. పెలోసీ అన్న కూడా మేయరర్ గా పని చేసిన వారే. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న పెలోసీ.. చిన్నతనం నుంచే రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వాషింగ్టన్ లో చదువుకునే రోజుల్లోనే పెనాన్షియర్ పాల్ పెలోసీని ప్రేమించి పెళ్లాడారు. పెళ్లి తర్వాత వారి కుటుంబం శాన్ ఫ్రాన్సిస్కోకు మారింది. వీరికి నలుగురు కుమార్తెలు.. ఒక కొడుకు.

అమెరికాలో పార్టీలు ఉన్నా.. డెమొక్రాట్లు.. రిపబ్లికన్ల మధ్యనే ఫైట్ మొత్తం. పెలోసి డెమోక్రాట్లకు కరుడుకట్టిన మద్దతుదారు. ఆమె ఎంత మొండిగా తన పార్టీని ప్రేమిస్తారనటానికి నిదర్శనంగా ఆమె చిన్నతనంలో జరిగిన ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు ఆమెకు ఒక బొమ్మను ఇస్తే.. అతగాడురిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి కావటంతో ఆ బొమ్మను తీసుకోనని ముఖం మీదనే చెప్పేసిన మొండితనం పెలోసీ సొంతం. చాలాకాలం ఇంటికే పరిమితమైనా.. తన 36 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు.

కాలిఫోర్నియాకు డెమోక్రటిక్ పార్టీ పెద్దగా వ్యవహరించిన ఆమె.. కాలిఫోర్నియా కాంగ్రెస్  సభ్యుడిగా వ్యవహరించే ఫిలిప్ బ్యూర్టన్ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది. ఆ ఫ్యామిలీతో పెలోసీకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ కుటుంబ రాజకీయ వారసురాలిగా పెలోసీ పేరు రావటంతో ఆ కుటుంబానికి చెందిన కీలక వ్యక్తి మరణం వేళ నిర్వహించిన ప్రత్యేక ఎన్నికల్లో వారి కుటుంబం తరఫున పెలోసీ ఎన్నికల బరిలోకి దిగటం.. విజయం సాధించటంతో 47 ఏళ్ల వయసులో ఆమె తొలిసారి ప్రతినిధుల సభలోకి అడుగు పెట్టారు. కట్ చేస్తే.. అప్పటి నుంచి 17 సార్లు గెలుపొందిన ఆమెన 35 ఏళ్లుగా కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2006లో తొలిసారి చట్ట ప్రతినిధుల సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగి.. 2019లో మరోసారి స్పీకర్ బాధ్యతను చేపట్టి.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె అదే పదవిలో కొనసాగటం విశేషం. ఆమెకు మాత్రమే సాధ్యమయ్యే మరో ప్రత్యేకత ఏమంటే.. అమెరికా చట్టసభకు స్పీకర్ గా పని చేసిన ఏకైక మహిళ ఆమెనే. మొదట్నించి పెలోసీది దూకుడు తత్త్వం. చాలామంది మాదిరి గుంభనంగా ఉండకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా ముఖం మీదనే చెప్పేస్తారు. కుండ బద్ధలు కొడతారు. అమెరికా రాజకీయాల్లో మొండిఘటంగా ఆమెకు పేరుంది.

ఆమె తీరు ఎలా ఉంటుందంటే.. 2003లో జరిగి ఇరాక్ పై అమెరికా దండయాత్రను తీవ్రంగా తప్పు పట్టారు. అది చాలా పెద్ద తప్పు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. అంతేకాదు.. 1989లో చైనాలో చోటు చేసుకున్న తిరుగుబాటు (తియానన్మెన్ స్క్వేర్) పై తీవ్రంగా స్పందించటమే కాదు.. స్వయంగా అక్కడకు వెళ్లి మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించటం ఆమెకు మాత్రమే సాధ్యమయ్యే పనిగా చెప్పాలి. హాంకాంగ్ లో జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. ట్రంప్ విషయంలో ఆమె చాలా దూకుడుగా వ్యవహరించారు. ఆయన్ను అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆడుకునేవారు.

వీరిద్దరి మధ్య బహిరంగంగా మాటలు కత్తులు విసురుకునేలా ఉండేవి. ట్రంప్ ప్రసంగ కాపీని నాన్సీ చించేయటం కెమేరాకు చిక్కటం.. అదో పెను దుమారంగా మారింది. ట్రంప్ అభిశంసన తీర్మానం విషయంలోనూ ఆమె దూకుడుగా వ్యవహరిస్తారని చెబుతారు. అంతేకాదు.. ఉక్రెయిన్ పైన రష్యా దండయాత్ర షురూ చేసిన వేళలో.. పెలోసీ ఆకస్మికంగా కీవ్ లో పర్యటించి.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ కావటం ఒక ఎత్తు అయితే.. చైనా తీవ్రంగా రియాక్టు అవుతున్నా.. పిచ్చ లైట్ తీసుకుంటూ పాతికేళ్ల తర్వాత తైవాన్ లో అడుగు పెట్టటం ద్వారా.. తనలాంటి రేర్ పీస్ అమెరికా రాజకీయాల్లో తానొక్కరే అన్న విషయాన్ని మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News