విశాఖ చుట్టూ విష రాజకీయం

Update: 2022-09-10 16:30 GMT
విశాఖ తనంత తానుగా అభివృద్ధి చెందింది. విశాఖ ఈ రోజు ఈ స్థితిలో ఉందంటే దానికి సహజసిద్ధమైన ప్రగతి తప్ప మరేమీ కాదు. విశాఖ ప్రాకృతిక అందాలు, అవకాశాలు చూసి మాత్రమే ఇక్కడ కేంద్ర పరిశ్రమలు వచ్చాయి. ఎవరూ ఫలానా పరిశ్రమ రావాలని కోరలేదు. ఒక్క స్టీల్ ప్లాంట్ తప్ప తక్కినవి అన్నీ కూడా వాటంతట అవే వచ్చాయి. ఈ రోజు విశాఖ అభివృద్ధిలో ముందుంది అంటే దానికి కారణం అయిన ఏయూ కానీ రైల్వే లైన్స్ కానీ, విశాఖ పోర్ట్ కానీ బ్రిటిష్ వారి టైం లో వచ్చినవే.

ఇక స్వాతంత్రానంతర కాలంలో విశాఖ చుట్టూ అనేక కేంద్ర పరిశ్రమలు వచ్చాయి. దానికి కారణం విశాఖకు ఉన్న సీ పోర్టు, రైల్ కనెక్టివిటీ. వీటిని ముందే చూసి విశాఖ ప్రగతికి బాటకు వేసిన వారు బ్రిటిష్ వారే అని చెప్పుకోవాలి. ఈ రోజుకీ విశాఖకే కాకుండా ఉత్తరాంధ్రా నుంచి అటు ఒడిషా దాకా ఉన్న పెద్దాసుపత్రి కేజీహెచ్ కూడా తెల్ల దొరల ఏలుబడిలోనే వచ్చింది. విశాఖలో ఉన్న ప్రసూతి ఆసుపత్రి గా ఉన్న  విక్టోరియా ఆసుపత్రి సైతం స్వాతంత్రానికి పూర్వం వచ్చింది.

ఇంత పెద్ద కలెక్టరేట్ భవనం కానీ అనేక భారే భవనాలు కానీ బ్రిటిష్ వారి టైం లో వచ్చినవే. ఇక విశాఖలో కాలక్రమంలో అభివృద్ధి జరిగింది అంటే దానికి కారణం  విశాఖలో ఉన్న ప్రశాంతత, ప్రజల నెమ్మదితనం అని చెప్పాలి. నిజంగా విశాఖకు రాజధాని హోదా ఏనాడో  రావాలి. అది కూడా మద్రాస్ నుంచి ఏపీ పదకొండు జిల్లాలుగా విడిపోయినపుడే. కానీ అది జరగలేదు. ఈ లోగా విశాలాంధ్రా ఏర్పాటు కావడంతో హైదరాబాద్ ఉమ్మడి ఏపీకి రాజధాని అయింది.

అరవై ఏళ్ల ఉమ్మడి ఏపీలో విశాఖకు పెద్దగా ఏ పాలకుడూ ప్రాధాన్యత ఇచ్చినదీ లేదన్నది నిష్టుర సత్యం. అయితే ప్రైవేట్ రంగంలో కొన్ని ఐటీ ఆధారిత  కంపెనీలు బాబు హయాంలో వస్తే ఐటీ సెక్టార్ కి సెజ్ లకు ఊతమిచ్చి రప్పించినది వైఎస్సార్ ఏలుబడిలో. అంతకు మించి విశాఖ ఏ విధంగానూ ప్రభుత్వాల వల్ల ముందుకు అడుగేసింది లేదు. ఇక ఏపీ విభజన తరువాత విశాఖ రాజధాని అవుతుందని అంతా ఆశించారు కానీ అది జరగలేదు. అయినా జనాలు మాత్రం ఇది తమ ప్రాప్తం అనుకుని మిన్నకున్నారు.

అయితే వైసీపీ సర్కార్ వచ్చాక మూడు రాజధానులు అంటూ విశాఖకు పెద్ద పీట వేస్తామంటే జనాలు సంతోషించారు. అయితే అది కూడా ఉద్యమించి ఏదో తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో కాదు, వస్తే రానీయ్ అన్న ఆలోచనతోనే. కానీ న్యాయస్థానంలో అమరావతే ఏకైక రాజధాని అంటూ తుది తీర్పు వచ్చాక విశాఖ మళ్లీ మామూలు అయిపోయింది. ఇపుడు మళ్ళీ మూడు రాజధానులు అంటున్నారు.

అసెంబ్లీలో బిల్లు పెడతామని వైసీపీ మంత్రులు నాయకులు చెబుతున్నారు. ఇక విశాఖను తామే అభివృద్ధి చేశామని టీడీపీ అంటోంది. విశాఖకు రాజధాని ఇచ్చి అన్ని రకాలుగా మేమే ప్రగతిపధాన నడిపిస్తామని వైసీపీ అంటోంది. అయితే విశాఖకు తలమానికంగా ఆ మాటకు వస్తే ఏపీకే నంబర్ వన్ గా ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో అటు అధికార వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఏం చేశాయన్న ప్రశ్న సహజంగానే ప్రజల నుంచి వస్తోంది. ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం కత్తి పట్టుకుని కూర్చుంటే రెండు  ప్రధాన పార్టీలు చేశాయని నిలదీస్తున్నారు.

అంతే కాదు  విశాఖ రైలే జోన్ అన్నది యాభైయేళ్ళ నినాదం, దాన్ని మూడేళ్ళ క్రితం సాకారం చేస్తామని బీజేపీ చెప్పినా ఈ రోజుకూ అడుగు ముందుకు పడలేదు. ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయడానికి వైసీపీ టీడీపీ ఏం చేశాయన్నది జనం మాటగా ఉంది. ఉత్తరాంధ్రా వెనకబడిన జిల్లాలకు అభివృద్ధి ప్యాకేజ్ కోసం కేంద్రంతో పోరాటం చేయడంలేదని, ఉత్తరాంధ్రాకు కేటాయించిన విద్యా సంస్థలు ఇతర ప్రాజెక్టుల అతీగతీ గురించి కూడా పట్టించుకోవడం లేదని జనాలు గుస్సా అవుతున్నారు.

కేవలం విశాఖ చుట్టూ విష రాజకీయం సాగుతోందని, రాజధాని అయినా కాకపోయినా అభివృద్ధి చేసే ప్రయత్నం మాత్రం జరగడం లేదని జనం గోడు పెడుతున్నారు. విశాఖకు గత అయిదేళ్లలో టీడీపీ చేసింది లేదు, మూడేళ్ళలో వైసీపీ చేసింది అంతకంటే లేదు అన్నది జనాల నిఖార్స్రైన మాటగా ఉంది. ఇప్పటికైనా విశాఖ చుట్టూ తమ రాజకీయ పోరాటాలను ఆరాటాలను ఆపి ప్రగతి దారి పట్టించే మార్గాన్ని చూడాలని కోరుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News