రైతుల్ని బెదిరించి.. లాఠీఛార్జ్ చేయిస్తారా?

Update: 2017-05-02 04:23 GMT
అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు చెల‌రేగిపోవాలి. రాజ‌కీయాల్లో ఉన్న వారికిదే ప్రాధ‌మిక ల‌క్ష‌ణం. అందుకే.. త‌మ‌కు ల‌భించిన అవ‌కాశాన్ని ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌టం లేదు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌ర్వాత సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ నేత‌లు సైతం ఇప్పుడు గొంతు స‌వ‌రించుకుంటున్నారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై టీఆర్ ఎస్ స‌ర్కారు వైఖ‌రిని త‌ప్పు ప‌డుతూ తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.

ప్రాజెక్టుల పేరుతో రైతుల భూముల్ని ఇష్టారాజ్యంగా సేక‌రిస్తున్నారంటూ విమ‌ర్శిస్తూ.. కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న పోరాటానికి తెలంగాణ అధికార‌ప‌క్ష నేత రివ‌ర్స్ మేనేజ్ మెంట్ చేయ‌టంతో కాస్తంత డిఫెన్స్ లో ప‌డ్డ ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. మిర్చి రైతులు త‌మ‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాలంటూ వీధుల్లోకి రావ‌టం.. ప్ర‌భుత్వ తీరుపై విరుచుకుప‌డ‌టం.. ప్ర‌భుత్వ విధానాల‌పై అస‌హ‌నంతో దాడుల‌కు సైతం దిగ‌టం కాంగ్రెస్ నేత‌ల‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంటి నాయ‌కుడి మీద పోరాడాల‌న్నా.. రాజ‌కీయంగా ఇరుకున పెట్టాల‌న్నా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎంతో కొంత అవ‌స‌ర‌మ‌ని ఫీల్ అవుతున్న వేళ‌.. రైతుల లాంటి బ‌ల‌మైన వ‌ర్గం ప్ర‌భుత్వ విధానాల్ని త‌ప్పు ప‌డుతూ రోడ్ల మీద‌కు వ‌స్తున్న వైనాన్ని.. త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ నేత‌లు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. దీనికి తోడు సార్వ‌త్రిక ఎన్నిక‌లకు స‌మ‌యం రెండేళ్లకు త‌గ్గిపోయిన నేప‌థ్యంలో అదికార‌ప‌క్షాన్ని ఇరుకున పెట్టేందుకు స‌రైన అవ‌కాశం కోసంఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు.. తాజా ప‌రిణామాలు అనుకోని వ‌రంగా మారాయి. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌పై ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు గ‌ళం విప్పుతున్న వైనంపై తెలంగాణ స‌ర్కారు ఇబ్బంది ప‌డుతున్న వైనాన్ని గుర్తించి.. త‌మ వాద‌న‌కు మ‌రింత ప‌దును పెట్టే ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేస్తున్నారు.

ప్ర‌భుత్వానికి ప్రాజెక్టులు క‌ట్టాల‌న్న చిత్త‌శుద్ది ఉంటే రైతుల్ని ఇబ్బంది పెట్ట‌కుండా భూసేక‌ర‌ణ చేయాలంటున్నారు మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్‌. అంతేకానీ రైతుల్ని బెదిరించ‌టం స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని ఆయ‌న చెబుతున్నారు. త‌ల్లిపాలు తాగి రొమ్ము గుద్దే సంస్కృతి టీఆర్ ఎస్ నేత‌ల‌ద‌న్న పొన్నం... భూసేక‌ర‌ణ‌లో రైతుల నిర్ణ‌యాలు.. స‌ల‌హాలు తీసుకుంటున్నామంటూనే రైతుల్ని బెదిరిస్తూ.. వారిపై లాఠీఛార్జ్ చేయించిన ఘ‌న‌త టీఆర్ ఎస్ స‌ర్కారుద‌న్నారు.

కేసీఆర్ హ‌యాంలో పూర్తి అయిన సాగునీటి ప్రాజెక్టులు.. కాంగ్రెస్ హ‌యాంలో పూర్తి అయిన వాటిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మేనా? అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.  మిర్చి రైతుల క‌ష్టాల‌పై స్పందించ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరుకు వ్య‌తిరేకంగా రైతుల‌కు కిలో మిర్చిని పోస్టు ద్వారా పంపిన‌ట్లుగా ఆయ‌న తెలిపారు. ప్రాజెక్టుల పూర్తిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ద‌మేనా అంటూ మ‌రో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రేణుకా చౌద‌రి ప్ర‌శ్నిస్తున్నారు. క‌ష్ట‌ప‌డి పండించిన పంట‌ను త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకునేలా టీఆర్ఎస్ స‌ర్క‌రు మైండ్ గేమ్ ఆడుతోంద‌ని ఎమ్మెల్సీ పొంగులేని త‌ప్పు ప‌ట్టారు. ఇలా.. రైతుల ఇష్యూల మీద కాంగ్రెస్ నేత‌లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా గ‌ళం విప్పుతున్న వైనం అదికార‌ప‌క్షానికి ఇబ్బందిక‌రంగా మారింద‌ని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News