కేసీఆర్ కేబినెట్ లో గవర్నరుకు భజన శాఖ!

Update: 2018-01-21 11:59 GMT
తెలుగు రాష్ర్టాల గవర్నరు నరసింహన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై చూపిస్తున్న అతి ప్రేమ ఆయన్ను విమర్శలపాల్జేస్తోంది. ఇప్పటికే గవర్నరుపై అటు ఏపీ - ఇటు తెలంగాణలోని వివిధ పార్టీల నేతలు గుర్రుమంటున్నారు. అయినా, గవర్నరు మాత్రం కేసీఆర్‌ పై బహిరంగ ప్రేమ కురిపిస్తుండడం వివాదాస్పదమవుతోంది. తాజాగా టీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ గవర్నరును ఇదే విషయంలో దుయ్యబట్టారు. కేసీఆర్ కేబినెట్లో గవర్నరుకు భజన శాఖ కేటాయించాలంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీసీఎల్పీ ఉపనేత జీవన్‌ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం గవర్నర్‌ నరసింహన్‌ టీఆర్‌ ఎస్‌ ప్రాజెక్టు ఏజెంట్‌ లా మాట్లాడారని ఫైర్‌ అయ్యారు. రాజకీయ భిక్ష కోసమే గవర్నర్‌ టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారని ఆరోపించారు.  రాజకీయాల పట్ల ఆసక్తి - కేసీఆర్‌ పై విశ్వాసం ఉంటే గవర్నర్‌ నరసింహన్‌ టీఆర్‌ ఎస్‌ పార్టీలో చేరాలని అన్నారు.
    
గవర్నర్‌ ప్రభుత్వ పథకాలు మెచ్చుకుంటే పరవాలేదు గానీ.. సీఎంను కాళేశ్వరం చంద్రశేఖర్‌ రావుగా సంభోదించడమేంటి అని పొన్నం ప్రశ్నించారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం వీలుంటే నరసింహన్‌ కు 'భజన శాఖ' కేటాయించాలన్నారు. తెలంగాణ ప్రజలు గవర్నర్‌ నరసింహన్‌ ను కల్వకుంట్ల నరసింహన్‌ రావు అని అనుకుంటున్నారని వ్యంగంగా అన్నారు. అక్కడితో ఆగని ఆయన ఫిరాయింపుల వ్యవహారాన్ని మరోసారి తవ్వారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించిన రోజే రాజ్‌ భవన్ ప్రతిష్ట మంటగలిసిందని పొన్నం అన్నారు.
    
కాగా గవర్నరు తెలంగాణపై ప్రేమ చూపుతూ ఏపీని విస్మరిస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు కూడా ఇంతకుముందు మండిపడ్డారు. ఏపీకి కొత్త గవర్నరు కావాలని వారు కేంద్రానికి లేఖలు కూడా రాశారు. మరోవైపు... తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆమధ్య గవర్నరుతో గొడవ పడ్డారు.
Tags:    

Similar News