కిర‌ణ్ మాట‌ల్ని కేసీఆర్ నిజం చేశాడ‌ట‌!

Update: 2018-09-17 04:25 GMT
తెలంగాణ రాజ‌కీయ వాతావ‌ర‌ణం శ‌ర‌వేగంగా మారుతోంది. ముందే ఊహించిన‌ట్లు ఎన్నిక‌ల వేళ‌లో  టీఆర్ ఎస్‌- కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పెద్ద ఎత్తున మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. టీఆర్ ఎస్ త‌ర‌ఫున అయితే కేసీఆర్.. లేదంటే కేటీఆర్ అప్పుడ‌ప్పుడు క‌విత‌లు మాత్ర‌మే మాట్లాడుతున్నారు. మిగిలిన నేత‌లు బోలెడంత మంది ఉన్నా.. ఈ ముగ్గురి మాట‌లే ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.

చివ‌ర‌కు కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్ రావు మాట‌లు సైతం ఎక్కువ‌గా వినిపించ‌ని ప‌రిస్థితి. దీనికి భిన్నంగా తెలంగాణ కాంగ్రెస్ లో నేత‌లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ‌టం మొద‌లెట్టారు. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసే వ‌ర‌కూ త‌మ‌కు పెద్ద‌గా ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన నేత‌లు సైతం ఇప్పుడు గ‌ళం విప్పుతున్నారు. కేసీఆర్ జ‌మానాపై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

కేసీఆర్ చెప్పిన మాట‌ల‌కు.. చేస్తున్న ప‌నుల‌కు మ‌ధ్య సంబంధం లేద‌ని.. త‌న‌కు తోచిన‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న మాట‌ను ఎవ‌రికి వారు త‌మ‌దైన స్టైల్లో విరుచుకుప‌డుతున్నారు. తెలంగాన రాష్ట్ర ఏర్పాటుకు ముందు జ‌రిగిన ఉద్య‌మాల్లో.. త‌మ వాద‌న‌ను వినిపించేందుకు కాంగ్రెస్ నేత‌లు ఏ మాత్రం మొహ‌మాట ప‌డే వారు కాదు. చివ‌ర‌కు సొంత పార్టీ నేత‌లైనా స‌రే (సీమాంధ్ర‌కు చెందిన నేత‌లు) తెలంగాణ విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గేవారు కాదు.

తీవ్ర ప‌ద‌జాలంతో సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేత‌ల‌పైనా విరుచుకుప‌డేవారు. అంతేనా.. నాటి చివ‌రి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ ను ఉద్దేశించి కూడా ఘాటు వ్యాఖ్య‌లు చేసేవారు. తెలంగాణ సాధ‌న త‌ప్పించి మ‌రేమీ ముఖ్యం కాద‌న్న‌ట్లుగా వారి తీరు ఉండేది. తెలంగాణ సాధ‌న త‌ర్వాత‌.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ అధికార‌ప‌క్షంగా ఏర్ప‌డితే.. కాంగ్రెస్ విప‌క్షంగా మారింది.

ఈ స‌మ‌యంలో ప‌లువురు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు లో ప్రొఫైల్ మొయింటైన్ చేస్తూ.. పెద్ద‌గా బ‌య‌ట‌కు రాకుండా కాలం గ‌డిపేవారు. అలాంటి వారిలో మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ ఒక‌రు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డి.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే ఆయ‌న సీమాంధ్రులపైనా.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత‌ల‌పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డే పొన్నం ప్ర‌భాక‌ర్ కు ఇప్పుడు కిర‌ణ్ కుమార్ రెడ్డి లాంటి వారి మాట‌లే అస్త్రాలుగా మారటం ఆస‌క్తిక‌రంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఓప‌క్క జ‌మిలి ఎన్నిక‌ల్ని స‌మ‌ర్థిస్తూ లా క‌మిష‌న్ కు లేఖ రాసిన కేసీఆర్‌.. తాను రాసిన రెండు నెల‌ల లోపే అసెంబ్లీని ర‌ద్దు చేసి.. ముంద‌స్తుకు ఎందుకు వెళుతున్నారో చెప్పాల‌ని పొన్నం నిల‌దీస్తున్నారు. ప్ర‌తిప‌క్షాలు ప‌ని చేయ‌టం లేద‌న్న కేసీఆర్ మాట‌లో నిజం లేద‌న్నారు.

తెలంగాణ వారికి పాల‌న చేత‌కాద‌ని నాడు కిర‌ణ్ చేసిన వ్యాఖ్య‌ల్ని నిజం చేసి చూపించార‌ని మండిప‌డ్డారు. మ‌రో తొమ్మిది నెల‌లు గ‌డిస్తే ఆర్థిక సంక్షోభంతో టీఆర్ ఎస్ స‌ర్కారు ప్ర‌తిష్ఠ దిగ‌జారుతుంద‌న్న ఉద్దేశంతోనే అసెంబ్లీని ర‌ద్దు చేశార‌న్నారు. ఒక‌ప్పుడు సీమాంధ్ర ట్యాగ్ ఉన్న సొంత నేత‌ల మాట‌ల్ని మాట వ‌ర‌స‌కు సైతం ప్ర‌స్తావించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌స్తావించేవారు కాదు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు వారి మాట‌ల్ని అస్త్రాలుగా మార్చుకొని కేసీఆర్ పై విరుచుకుప‌డ‌టం పొన్నంతో మొద‌లైంద‌ని చెప్పక త‌ప్ప‌దు.


Tags:    

Similar News