జ‌గ‌న్ కు ఆకాశ‌మే హ‌ద్దు:పోసాని

Update: 2018-05-26 11:02 GMT
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.....మండుటెండ‌ల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తోన్న జ‌గ‌న్ ను  ప్రముఖ నటుడు - దర్శకుడు పోసాని కృష్ణమురళి శ‌నివారం క‌లిసి మ‌ద్ద‌తు తెలిపారు. జ‌గ‌న్ లోని నిజాయితీ, మాట మీద నిలబడే తత్వం తనకు నచ్చాయన్నారు. ఆయ‌న‌లోని ధృడ సంకల్పం త‌న‌ను ఆకర్షించింనందువ‌ల్లే ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నాన‌ని చెప్పారు. జ‌గ‌న్ సంకల్పం చూసి తాను ఆశ్చర్య‌పోయాన‌న్నారు. తాను రెండు, మూడు కిలోమీటర్లు కూడా నడవలేకపోయాన‌ని....3 వేల కిలోమీటర్లు న‌డిచిన జ‌గ‌న్ పాద‌యాత్ర చ‌రిత్ర‌లో నిలుస్తుంద‌న్నారు. ప్ర‌జా సమస్యలల‌పై జ‌గ‌న్ కు చాలా చిత్త‌శుద్ధి ఉంద‌ని, ఆయనకు ఓటువేసి ముఖ్యమంత్రిని చేయాల‌ని రాష్ట్ర ప్రజలందరికీ పోసాని విజ్ఞప్తి చేశారు. ఆయ‌న‌కు ఒక్క‌సారి ఓటువేసి గెలిపిస్తే..ఆయ‌న పాల‌న‌ను చూసి మ‌ళ్లీ మ‌ళ్లీ ఓటు వేస్తార‌ని అన్నారు.

జ‌గ‌న్ ను పోసాని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. జ‌గ‌న్ కు ఆకాశ‌మే హ‌ద్ద‌ని, పాదయాత్రలో పాల్గొన్న త‌ర్వాత  జగనే సీఎం కావాలనిపించిందని అన్నారు. జ‌గ‌న్ అబద్దపు హామీలివ్వడం లేదని, కమిట్‌మెంట్ ఉన్న నాయకుడు జగన్ సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు.

దైవసాక్షిగా, త‌న కుటుంబ సాక్షిగా త‌న మీద ఒట్టు వేసుకుని చెబుతున్నాన‌ని....జగన్ చాలా మంచివాడని పోసాని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. అన్ని వర్గాలను జ‌గ‌న్ ఆక‌ట్టుకుంటార‌ని, సీఎం అయ్యే స‌మ‌ర్థ‌త ఆయ‌న‌కుంద‌ని అన్నారు. గ‌త సీఎంల కంటే జగన్ స‌మ‌ర్థవంతంగా పనిచేయ‌కుంటే త‌న‌ను చెప్పుతో కొట్టమ‌ని అన్నారు. తానేదో ప‌ద‌వుల‌ను ఆశించి జ‌గ‌న్ ను పొగ‌డ‌డం లేద‌ని - త‌న‌కు ఎమ్మెల్యే - ఎంపీ - ఎమ్మెల్సీ - రాజ్యసభ - ఎటువంటి పదవులు వ‌ద్ద‌ని పోసాని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అబ‌ద్ధ‌పు హామీల‌తో అధికారంలోకి రాన‌ని జగన్ చెప్పిన మాటలు ఆక‌ట్టుకున్నాయ‌ని, ఇంత పరిణితి చెందిన నేతను తాను చూడలేదని అన్నారు. చంద్ర‌బాబు, టీడీపీ నేత‌లు మిన‌హా....రాష్ట్ర ప్రజలెవరూ జ‌గ‌న్ ను తప్పుగా అర్థం చేసుకోలేద‌ని అన్నారు.

2009లో ప్ర‌జారాజ్యం త‌ర‌ఫున పోసానికి చిరంజీవి పిలిచి మ‌రీ ఫ్రీగా టికెట్ ఇచ్చారు. అయితే, తాను ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంచ‌న‌ని, నిజాయితీగా సేవ చేస్తాన‌ని తాను పోటీ చేసిన చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు పోసాని మాట ఇచ్చారు. అయితే, ఆయన ప్ర‌త్య‌ర్థులు డ‌బ్బు పంచ‌డంతో పోసాని ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. దీంతో, 2019 ఎన్నిక‌ల్లో వైసీసీ త‌ర‌ఫున పోసాని పోటీ చేయ‌బోతున్న‌ట్లు పుకార్లు వ‌చ్చాయి. అందుకు త‌గ్గ‌ట్లుగానే తాను జ‌గ‌న్ కు మ‌ద్ద‌తిస్తాన‌ని, త‌న‌కు వైఎస్ అంటే అభిమాన‌మ‌ని పోసాని చాలాసార్లు మీడియా ముఖంగానే చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఆ పుకార్ల‌కు తెర‌దించుతూ తాను ఏ ప‌ద‌వీ ఆశించ‌డం లేద‌ని, వైసీపీకి, జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు మాత్రం తెలుపుతాన‌ని పోసాని చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.
Tags:    

Similar News