పోసాని..ఓ మంచి మ‌నిషి

Update: 2015-07-17 13:08 GMT
భిన్న‌మైన డైలాగ్‌ల‌తో..సెటైర్‌ల‌ను త‌న‌దైన శైలిలో పండించే పోసాని కృష్ణ‌ముర‌ళీ త‌న‌లో ఓ మంచి మ‌నిషి దాగున్నాడ‌ని మ‌రోమారు నిరూపించుకున్నారు. సామాజిక స‌మ‌స్య‌ల‌పై త‌న‌దైన శైలిలో స్పందించే పోసాని...ఇటీవ‌లి కాలంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశం అయిన ప్ర‌త్యూష ఘ‌ట‌న‌ను చూసి చ‌లించిపోయారు. ఆమెకు స‌హ‌క‌రించ‌కేందుకు ముందుకు వ‌చ్చారు.

పాపాత్ముడు అయిన తండ్రి, స‌వతి త‌ల్లి చేతిలో ప్ర‌త్యూష తీవ్ర మాన‌సిక, శారీర‌క క్షోభ అనుభ‌వించిన సంగ‌తి తెలిసిందే. అస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సంద‌ర్భంలో ప‌లు మీడియా సంస్థ‌లు ఆమెను సంప్ర‌దించ‌గా ఆమె త‌ను ప‌డిన న‌ర‌కాన్ని వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా అరాచ‌కంగా ప్ర‌వ‌ర్తించిన ఆమె త‌ల్లిదండ్రులు..ఆ చిన్నారి ప‌డిన వేద‌న గురించి పోసాని తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆమె సొంతంగా త‌న కాళ్ల‌మీద నిల‌బ‌డే వ‌ర‌కు అండ‌గా ఉండాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ విష‌య‌మై ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ప్ర‌త్యూష ఘ‌ట‌న త‌న‌ను తీవ్ర వేద‌న‌కు గురిచేసింద‌ని...ఆ విష‌యం తెలిసిన త‌ర్వాత తానెంతో ఏడ్చాన‌ని పోసాని ఆవేద‌న‌గా చెప్పారు. అందుకే అంద‌రిలాగా ఏదో ఆస్ప‌త్రిలో ఉన్న ఆమెను ప‌రామ‌ర్శించాం...ప‌ని అయిపోయింది అన్న‌ట్లుగా కాకుండా...త‌న‌వంతుగా ఆమెకు అండ‌గా నిల‌బ‌డాల‌ని తీర్మానించుకున్న‌ట్లు పోసాని ప్ర‌క‌టించారు. ప్ర‌త్యూష ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జీ అయిన నుంచి...ఆమె చ‌దువు పూర్త‌య్యి, పెళ్లి చేసుకునే వ‌ర‌కు తాను ఆర్థిక స‌హాయం అందిస్తాన‌ని పోసాని ప్ర‌క‌టించారు. సాయం వ‌ద్దు అని ప్ర‌క‌టించేవ‌ర‌కు కంటికిరెప్ప‌లా ఆదుకునే బాధ్య‌త తాను తీసుకుంటానని పోసాని ప్ర‌క‌టించారు. ప్ర‌త్యూష‌ తండ్రి, ఆమె పిన‌త‌ల్లి విష‌యంలో తానే తీర్పు ఇస్తే వ్య‌క్తిని అయితే...వాళ్ల‌కు ఉరిశిక్ష వేస్తాన‌ని మండిప‌డ్డారు.

ప్ర‌త్యూష విష‌యంలో తానెందుకు అంత‌లా రియాక్ట‌య్యానో కూడా పోసాని ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఒక‌ప్పుడు త‌మ కుటుంబ‌ బాగా బ్ర‌తికింద‌ని అయితే...ఆస్తిపాస్తులు లేని ద‌శ‌లో త‌న తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని గ‌తాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ క్ర‌మంలో తాను  దారి త‌ప్పాల్సిన‌ప్ప‌టికీ కొంద‌రి ప్రోత్సాహం వ‌ల్ల ప్ర‌యోజ‌కుడిని అయ్యాన‌ని  వివ‌రించారు. త‌న జీవిత‌మే క‌ష్టాల‌కు ప్ర‌త్యక్ష ఉదాహ‌ర‌ణ అయిన నేప‌థ్యంలో ఇబ్బందులు ప‌డేవారిని చూస్తే త‌న గుండె త‌రుక్కుపోతుంద‌ని అన్నారు. అందుకే ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా...తాను స్పందిచ‌కుండా ఉండ‌లేన‌ని చెప్పారు.
Tags:    

Similar News