'అశ్లీల' అరెస్ట్ ల ప‌ర్వంలో తొలి అరెస్ట్!

Update: 2017-10-09 05:06 GMT
సినీతార‌ల ఫోటోల్ని మార్ఫింగ్ చేయ‌టం.. వారిని అశ్లీలంగా చూపించ‌టం.. అలాంటి ఫోటోల్ని అప్ లోడ్ చేసే వారిపై తెలుగుసినిమా ఇండ‌స్ట్రీ వార్ ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. హ‌ద్దులు దాటుతున్న వెబ్‌ సైట్ల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు పోరు మొద‌లెట్టిన వైనంలో తొలి అరెస్ట్ న‌మోదైంది.

క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని బెంగ‌ళూరులో ఉంటూ.. నాలుగు అశ్లీల వెబ్ సైట్ల‌ను నిర్వ‌హిస్తున్న 28 ఏళ్ల దాస‌రి ప్ర‌దీప్‌ ను సైబ‌ర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సులువుగా డ‌బ్బులు సంపాదించ‌టం కోసం అశ్లీల వెబ్ సైట్ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్ తీసుకొచ్చిన ఇత‌గాడు.. ప‌లువురు సినీ తార‌ల ఫోటోల్ని మార్ఫింగ్ చేసి.. వారిపై అస‌భ్య‌రాత‌లు రాస్తున్న‌ట్లుగా గుర్తించారు.

ఇటీవ‌ల మా అధ్య‌క్షుడు శివాజీ రాజా.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌రేశ్ ఇత‌రులు ఇచ్చిన కంప్లైంట్‌ పై దర్యాప్తు షురూ చేసిన సైబ‌రాబాద్ పోలీసులు.. విచార‌ణ‌లో భాగంగా ప్ర‌దీప్ ను గుర్తించారు. ఐటీ చ‌ట్టం 87 - 87ఏ కింద కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు షురూ చేశారు. త‌మ విచార‌ణ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 50 వెబ్ సైట్ల‌ను పోలీసులు గుర్తించారు. రానున్న రోజుల్లో స‌ద‌రు వెబ్ సైట్ల మీదా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఐడీ ఎస్పీ రామ్మోహ‌న‌రావు చెబుతున్నారు. ప్ర‌దీప్ నిర్వ‌హిస్తున్న ఒక్కో సైట్ ద్వారా రూ.10వేల వ‌ర‌కూ సంపాదిస్తున్న‌ట్లుగా పోలీసులు వెల్ల‌డించారు.
Tags:    

Similar News