టీడీపీకి షాక్‌...వేటు వేసినా మ‌ళ్లీ గెలిచాడు

Update: 2015-09-18 06:19 GMT
ఏపీలోని ప్ర‌కాశం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. గ‌త స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఈద‌ర హ‌రిబాబు పొన్న‌లూరు నుంచి టీడీపీ త‌ర‌పున జ‌డ్పీటీసీగా ఎన్నిక‌య్యారు. ముందు నుంచి జ‌డ్పీ పీఠం త‌న‌కే వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్న ఆయ‌న‌కు అనూహ్యంగా షాక్ త‌గిలింది. పార్టీ అధిష్టానం చివ‌ర్లో య‌ర్ర‌గొండ‌పాలేనికి చెందిన డాక్ట‌ర్ మ‌న్నే ర‌వీంద్ర పేరును తెర‌పైకి తెచ్చింది.  ఎన్నిక‌ల రోజున ఈద‌ర హ‌రిబాబు టీడీపీకి పెద్ద షాక్ ఇస్తూ వైకాపా మ‌ద్ద‌తుతో జ‌డ్పీ చైర్మ‌న్‌ గా ఎన్నిక‌య్యారు. వైకాపాకు చెందిన నూక‌సాని బాలాజీ వైస్ చైర్మ‌న్ అయ్యారు.

జిల్లా ప‌రిష‌త్‌ లో వైకాపాకే ముగ్గురు స‌భ్యులు ఎక్కువ‌గా ఉన్నా..అధికార టీడీపీ ఇద్ద‌రు వైకాపా జ‌డ్పీటీసీల‌ను త‌న వైపున‌కు తిప్పుకుని క్యాంప్ రాజ‌కీయాలు న‌డిపింది. త‌మ అభ్య‌ర్థి మ‌న్నె ర‌వీంద్ర గెలుపు న‌ల్లేరుమీద న‌డ‌కే అని ధీమాతో ఉంది. తీరా ఎన్నిక‌ల్లో చూస్తే ఈద‌ర హ‌రిబాబు అనూహ్యంగా వైకాపా మ‌ద్ద‌తుతో జ‌డ్పీచైర్మ‌న్ అయ్యారు. జ‌డ్పీచైర్మ‌న్‌ గా ఈద‌ర ఎన్నిక చెల్ల‌దంటూ ఆయ‌న ప్ర‌త్య‌ర్థివ‌ర్గం కోర్టును ఆశ్ర‌యించింది. ఈద‌ర కూడా హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు గ‌త సంవ‌త్స‌రం ఆగ‌స్టు 11న క‌లెక్ట‌ర్ విజ‌య్‌ కుమార్ ఈద‌ర‌ పై జ‌డ్పీటీసీగా అన‌ర్హ‌త వేటు వేశారు. త‌ర్వాత ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న త‌న ప‌ద‌వి నుంచి దిగిపోవాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం జ‌డ్పీ చైర్మ‌న్‌ గా వైకాపాకు చెందిన నూక‌సాని బాలాజీ కొన‌సాగుతున్నారు.

 ఈ వివాదంపై ఈదర తొలుత జిల్లా కోర్టును, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయిం చారు. హైకోర్టులో ఈదరకు అనుకూలంగా తీర్పువచ్చింది. విప్‌ ధిక్కరించా రంటూ కలెక్టర్‌ వేటు చెల్లదని హైకోర్టు తీర్పును వెలువరించింది. త‌ర్వాత జ‌డ్పీచైర్మ‌న్ కార్యాల‌యానికి అధికారులు తాళాలు వేశారు. దీనిపై నిర‌స‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న త‌ర్వాత సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల ప్ర‌కారం హ‌రిబాబు శుక్ర‌వారం మ‌ళ్లీ జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌ గా బాధ్య‌త‌లు చేప‌ట్టే ఛాన్సులు ఉన్నాయి. ఏదేమైనా హ‌రిబాబుకు జ‌డ్పీచైర్మ‌న్ పీఠం ద‌క్క‌కుండా టీడీపీ చేసిన ప్ర‌య‌త్నాలన్ని ఫెయిల్ అయ్యాయి. చివ‌ర‌కు సుప్రీంకోర్టులో కూడా ఆయ‌న‌కే అనుకూలంగా తీర్పురావ‌డంతో టీడీపీకి పెద్ద షాక్ త‌గిలిన‌ట్ల‌య్యింది.
Tags:    

Similar News