తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్....ప్రధాని మోదీపై - బీజేపీ - కాంగ్రెస్ ల పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. దేశంలో ప్రజలు ఆ రెండు పార్టీల విధివిధానాలతో విసిగివేసారిపోయారని - ప్రస్తుతం దేశానికి థర్డ్ ఫ్రంట్ అవసరముందని నొక్కివక్కాణించారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ కోల్ కతాలో భేటీ అయ్యారు. త్వరలోనే తాము ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నామని, తమకు పలు ప్రాంతీయ పార్టీల మద్దతుందని కేసీఆర్ - మమత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా - ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్....కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ లో ప్రకాశ్ రాజ్ ను భాగస్వామిని చేసేందుకు కేసీఆర్ యోచిస్తున్నారని పుకార్లు వస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన అనంతరం ప్రకాశ్ రాజ్.....ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. వారిద్దరూ కలిసి సమకాలీన రాజకీయాలు - ఫెడరల్ ఫ్రంట్ ల పై మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలోనే వారివురూ చర్చించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై కేసీఆర్ - ప్రకాశ్ రాజ్ ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బెంగళూరులో ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యానంతరం ప్రకాశ్ రాజ్....బీజేపీ - ప్రధాని మోదీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రకాశ్ రాజ్ ను కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు పంపేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారని పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ - కేసీఆర్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.