దేశ రాజకీయాలు ఎన్నడూ లేనంత ఆసక్తిగా మారాయి.. కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ అంటూ కేసీఆర్ లేవనెత్తిన ఫెడరల్ ఫ్రంట్ కు ఆది - కర్త - కర్మ - క్రియ వేరే ఉన్నారని ఢిల్లీ పెద్దలు చెబుతున్నారు. కేసీఆర్ గురువే ఇదంతా వెనుకుండి చేయిస్తున్నారన్నది ఇన్ సైడ్ టాక్. ఇన్నాళ్లు గా పేరు బయటకు రాని ఆ రహస్య నేత విషయం ఇప్పుడు వెలుగులోకి రావడం తాజాగా సంచలనమైంది..
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ముందుపడినా దాని వెనుకున్నది అపర చాణక్యుడు ప్రణబ్ అనే విషయం తాజాగా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లో కురువృద్ధుడు - అపర భీష్ముడిగా పేరొందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఎప్పటినుంచో ప్రధాని కావాలన్న ఆశ బలంగా ఉండేది. కానీ సోనియా గాంధీ ప్రణబ్ ప్రధాని అయితే తన ప్రతిష్ట మసకబారుతుందని ఆయన్ను ఆర్థిక మంత్రిగానే కొనసాగించి ప్రధాని ఆశలపై నీళ్లు చల్లారు. ఇక ఆ తర్వాత ప్రణబ్ ఉంటే ఎప్పటికైనా తన కొడుకు రాహుల్ కు పోటీ వస్తాడని భావించిన సోనియా ఆయన్ను రాష్ట్రపతి చేసి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించింది..
అయితే కేసీఆర్ కు ప్రణబ్ అంటే వల్లమాలిన అభిమానం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై సంతకం చేసింది ప్రణబ్ ముఖర్జీనే.. ప్రణబ్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఢిల్లీ వెళితే కేసీఆర్ ఆయనకు పాదాభివందనం చేసేశారు. రాజకీయ కురువృద్ధుడిగా తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ కు ఎన్నో సలహాలు ఇచ్చారు. ఇప్పుడా గురువు కోరిక తీర్చడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నాడని తెలిసింది.
దేశంలో వచ్చే ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ - బీజేపీలో అధికారంలోకి రాకపోతే ఫెడరల్ ఫ్రంట్ కీలకమవుతుంది. అప్పుడు మమత - నవీన్ పట్నాయక్ - డీఎంకే సహా ప్రాంతీయ పార్టీలు కీలకమవుతాయి. ఒకవేళ కేసీఆర్ ను ప్రధానిగా చేయడానికి మిగత పక్షాలు ఒప్పుకోకపోతే వెంటనే గురువు అయిన ప్రణబ్ ముఖర్జీని రంగంలోకి దించడానికి కేసీఆర్ ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రణబ్ అయితే దేశంలోని అన్ని రాజకీయ పక్షాలకు ఎలాంటి అభ్యంతరం లేదు. రాజకీయాల్లో ఆరితేరిన ఈయనను ఎవరూ వ్యతిరేకించరు. అందుకే ప్రణబ్ ను ప్రదాని చేసి తాను కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖను తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది.
తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు కూడా ప్రణబ్ ను మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ ను చేశాయి. ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ వచ్చే నెలల్లో జరిగే ఆర్ ఎస్ ఎస్ సమావేశానికి రావాలని ప్రణబ్ ముఖర్జీని కోరాడట.. బీజేపీ మూలాలున్న ఆర్ ఎస్ ఎస్ ఇలా కాంగ్రెస్ మాజీ నేతను ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పరిణామాలు వచ్చే 2019 ఎన్నికలను బేస్ చేసుకునే అనే సంకేతాలు ఇస్తున్నాయి. అప్పుడు బీజేపీకి తగినన్ని సీట్లు రాకపోతే ప్రాంతీయ పార్టీల మద్దతుతో బీజేపీ ప్రధానిగా ప్రణబ్ ను చేయవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మోడీపై రోజురోజుకు ప్రాంతీయ పార్టీల్లో పెరుగుతున్న వ్యతిరేకత దృష్ట్యా ప్రణబ్ ను ఆర్ ఎస్ ఎస్ ఆహ్వానించడం కీలక పరిణామంగా మారింది.