పార్లమెంట్ లో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు : ప్రశాంత్ భూషణ్ ఆందోళన..

Update: 2021-11-30 06:32 GMT
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు పార్లమెంట్‌ లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి సర్కార్ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా పలు చర్చలకి దారితీస్తుంది. అధికార పక్ష వైఖరి పట్ల విమర్శలు ఎదురవుతోన్నాయి. పార్లమెంట్ చరిత్రలో ఓ బ్లాక్ డేగా అభివర్ణిస్తోన్నారు. ప్రజాస్వామ్యం క్రమంగా హత్యకు గురవుతోందనే ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తోన్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ లోక్‌ సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రభుత్వం ఏ మాత్రం చర్చ లేకుండా ఆమోదం తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ఈ రెండు సభల్లో బిల్లును ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చ లేకుండానే దీన్ని ఆమోదించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఈ బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.

దీనిపై చర్చించడానికి ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వాటిని టేబుల్ చేసిన కొద్దిసేపటికే ఈ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఇది సరికొత్త వివాదాన్ని సృష్టించినట్టయింది. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు రూపంగా భావించే పార్లమెంట్‌లో ఎలాంటి చర్చలకు అవకాశం ఇవ్వకుండా బిల్లులను ఆమోదించడం పట్ల కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ భాగస్వామ్య పక్షాలు మండిపడుతున్నాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ పక్ష నేతలు అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున ఖర్గె ఇవ్వాళ ఉభయ సభలను స్తంభింపజేయాలని నిర్ణయించుకున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ దీన్ని ధృవీకరించారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇస్తే గానీ సభా కార్యకలాపాలను సాగనివ్వబోమని హెచ్చరించారు.

పార్లమెంట్‌ లో తొలి రోజు చోటు చేసుకున్న పరిణామాల పట్ల సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన తీరు తనను విస్మయ పరిచిందని వ్యాఖ్యానించారు. ఎలాంటి చర్చలు గానీ, ఓటింగ్ గానీ లేకుండా మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించడం అభ్యంతకరమని అన్నారు. దీనిపై చర్చించాలంటూ పట్టుబట్టిన ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ఇదివరకు మూడు వ్యవసాయ చట్టాలు కూడా పార్లమెంట్ సభల్లో ఎలాంటి చర్చలు లేకుండానే ఆమోదం పొందిందని ప్రశాంత్ భూషణ్ గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో- కోట్లాదిమంది రైతులకు సంబంధించిన బిల్లుల ఉపసంహరణను కూడా కేంద్ర ప్రభుత్వం అదే తరహాలో ముగించిందని విమర్శించారు. ఈ పరిణామాలు ఆందోళనలను కలిగించేవిగా ఆయన అభివర్ణించారు. ఈ బిల్లుపై చర్చ జరపాలంటూ పట్టుబట్టిన 12 మంది రాజ్యసభ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు.


Tags:    

Similar News