ఆఖ‌రి నివాళి ఆయ‌న‌ది ...అంతిమ సంస్కారాలు ఆమెవి

Update: 2016-12-06 18:04 GMT
ఒక మామూలు బ్రాహ్మ‌ణ మ‌హిళ‌.. ఎలాంటి ఆద‌ర‌ణ లేని స్థానం నుంచి స్వ‌యంకృషితో ఎదిగి.. అవ‌మానాల్ని.. ఛీత్కారాల్ని భ‌రించి.. అమేయ‌మైన శ‌క్తిగా మార‌ట‌మే కాదు.. ఆశేష ప్ర‌జానీకం ప్రేమ‌గా.. అమ్మా అని పిలిపించుకున్న మ‌హాధినేత ఎవ‌రైనా ఉన్నారా? అంటే.. జ‌య‌ల‌లిత మిన‌హా మ‌రెవ‌రూ లేర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌ద‌గ‌జాల్నాంటి మ‌గ‌మ‌హారాజుల్ని ఎదిరించ‌ట‌మే కాదు.. త‌న ముందు సాగిల‌ప‌డేలా చేసుకున్న స‌త్తా ఆమె సొంతం. భ‌విష్య‌త్తులో జ‌య‌ల‌లిత గురించి విన్న వారంతా కాల్పానిక క‌థ‌నంగా ఫీల‌య్యే అవ‌కాశం ఉంద‌న‌టంలో అతిశ‌యోక్తి లేద‌నే చెప్పాలి. జ‌య‌ల‌లిత మ‌ర‌ణ వార్త తో కోట్లాది మంది కంట క‌న్నీరు కారేలా చేసింది. మృత్యువుతో సుదీర్ఘకాలం పోరాడి.. అంతిమంగా విఫ‌ల‌మై.. శాశ్విత నిద్ర‌లోకి వెళ్లిపోయినా.. అశేష జ‌న‌వాహిని గుండెల్ని గెలుసుకొని.. ఒక స్మృతిలా మిగిలిపోతుంద‌న‌టంలో సందేహం లేదు.

అలాంటి అమ్మ అంతిమ‌యాత్ర సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకున్నాయి. అమ్మ‌కు క‌డ‌సారి నివాళి అర్పించిన వ్య‌క్తిగా దేశ ప్ర‌ధ‌మ పౌరుడు ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీగా నిలిచారు. ఢిల్లీ నుంచి ఆల‌స్యంగా వ‌చ్చిన ఆయ‌న‌.. అమ్మ వ‌ద్ద‌కు వ‌చ్చి ఆమెకు అంతిమ నివాళిని ఆర్పించారు. ఆయ‌న నివాళి కార్య‌క్ర‌మం ముగిసిన వెంట‌నే..జ‌య‌ల‌లిత పార్థివ‌కాయాన్ని అంతిమ‌యాత్ర‌కు సిద్ధం చేశారు.

ఇక‌.. మెరీనాబీచ్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక వేదిక వ‌ద్ద అమ్మ అంతిమ సంస్కారం పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర అధికారిక లాంఛ‌నాల‌తో ఆమె అంతిమ‌సంస్కారాలు పూర్తి చేశారు. మొత్తం ప్ర‌క్రియ పూర్తి అయ్యే వేళ‌.. అమ్మ నెచ్చెలి శ‌శిక‌ళ స్వ‌యంగా గంధం చెక్కలు పేర్చ‌ట‌మే కాదు.. పార్థిప‌దేహాన్ని ఉంచిన పేటిక‌ను భూమిలోప‌ల‌కు ఉంచిన త‌ర్వాత‌.. పెద్ద ఎత్తున గంధం చెక్క‌ల‌తో నింపి.. చిర‌కాల స్నేహితురాలికి చివ‌ర‌గా సాగ‌నంపారు. ఆఖ‌రి నివాళి భార‌త ప్ర‌ధ‌మ పౌరుడి చేతుల మీదుగా సాగితే.. అంతిమ సంస్కారాలు స్నేహితురాలి చేతుల మీద‌గా సాగ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News