జగన్ మూడేళ్ల పాలనపై సిం‘ఫుల్’ రివ్యూ ఇచ్చిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ

Update: 2022-06-27 03:53 GMT
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్న మాట నోటి నుంచి వచ్చినంతనే తెలుగు ప్రజలకు గుర్తుకు వచ్చేస్తారు సీనియర్ నటుడు ‘పృథ్వీ’. తనకు మాత్రమే సాధ్యమైన టైమింగ్.. అంతకు మించిన రైమింగ్ లాంటి మాటలతో అందరిని ఆకట్టుకునే ఆయన.. వెండి తెర మీదనే కాదు.. రియల్ లైఫ్ లోనూ పొలిటికల్ లీడర్ గా చెలరేగిపోవటం తెలిసిందే.

అతి తక్కువ సమయంలో ఎక్కువగా డెవలప్ అయిన ఆయన.. తన వైరి వర్గానికి చెందిన వారిపై ఎంతటి ఘాటు వ్యాఖ్యలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి ఆయన.. గతంలో తన నోటి నుంచి వచ్చిన మాటలకు చాలా బాధ పడుతున్నారు. తన బలుపునకు సారీ చెబుతున్నారు. తనను క్షమించాలని కోరుకుంటున్నారు.

ఒకప్పటి అరవీర భయంకర వైఎస్ జగన్ ఫ్యాన్ అయిన పృథ్వీ.. ఇప్పుడు ఏపీ సీఎంకు.. ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అన్న రీతిలో జగన్ కోసం కోసుకునేటట్లు వ్యవహరించిన ఆయన ఇప్పుడు తత్త్వం తెలిసిందంటూ వాపోతున్నాడు. అలాంటి ఆయన తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన అంశాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన్ను జగన్ మూడేళ్ల పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

జగన్ మూడేళ్ల పాలనపై పృథ్వీ చేసిన సిం‘ఫుల్’ రివ్యూను ఆయన మాటల్లోనే చెబితే.. ‘‘నేనీ మధ్య కోనసీమ వెళ్లొచ్చాను. ఫస్ట్రేషన్ ఉంది. ఇదే విషయాన్ని ఒకతను నాతో చెబుతూ.. 90 శాతం అంతా అద్భుతంగా చేశారంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? 90 శాతం మంది లబ్థి పొందారంటే ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? అని ప్రశ్నించాడు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ డ్రైవర్ సాయంత్రానికి రూ.2500 చేతికి వచ్చేవి. రూ.2వేలు ఇంట్లో ఇచ్చేసి రూ.500 చేతిలో పెట్టుకునేవాడు డ్రింక్ కోసం. ఈ మధ్యన వాడ్ని అడిగితే.. ఏ బ్రాండ్ తాగాలో అర్థం కావట్లేదు.. మందు మట్టుకు మానలేదు సార్ అంటున్నాడు. కాకుంటే చేతికి వచ్చే రూ.2500 మందుకే పోతున్నాయట. ఎవరూ హ్యాపీగా లేరండి. వాళ్లంతా మాత్రం నొక్కుడు మీదే ఉన్నారు. ఏసీ గదుల్లో కూర్చొని మాటలు చెప్పొచ్చు. కానీ.. గ్రౌండ్ లెవల్లో మాత్రం అద్భుతంగా ఏమీ లేదు’’ అని తేల్చేశారు.

ఒకప్పటి వీర విధేయ రామగా జగన్ కు బంటుగా వ్యవహరించిన పృథ్వీ.. తాజాగా జగన్ మూడేళ్ల పాలనను తేల్చేయటం.. తాను జగన్ పార్టీలో ఉన్నప్పుడు తన నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకు ఆయన సారీ చెప్పటమే కాదు.. బుద్దిగా చెంపలు వేసుకుంటూ.. ఆ తప్పు మాత్రం మళ్లీ జరగదని చెబుతున్నారు.
Tags:    

Similar News