పెంపుడు జంతువుల‌పై ప‌న్ను...షాకింగ్ న్యూస్‌!

Update: 2017-10-24 10:57 GMT
భూమి శిస్తు - నీటి ప‌న్ను - వ‌స్తు సేవ‌ల ప‌న్ను.....ఇలా ర‌క‌ర‌కాల ప‌న్నుల గురించి మ‌నంద‌రికీ తెలుసు. నానా ర‌కాల ప‌న్నుల‌తో ప్ర‌భుత్వం....ప్ర‌జ‌ల న‌డ్డి విరుస్తోంది. అయితే, మ‌నం ఇంట్లో ప్రాణ‌ప్ర‌దంగా పెంచుకునే పెంపుడు జంతువుల‌పై కూడా ప్ర‌భుత్వం ప‌న్ను విధిస్తుంద‌ని ఎవ‌ర‌న్నా ఊహించారా? అందుకే, అనూహ్యంగా పొరుగు రాష్ట్రం పంజాబ్ లో ....కుక్క - పిల్లి - గుర్రం - పంది - బర్రె - ఆవు - ఏనుగు - ఒంటె - గుర్రం వంటి పెంపుడు జంతువుల మీద పన్ను విధిస్తూ పంజాబ్ ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, మంగళవారం ఓ నోటిఫికేషన్ ను కూడా విడుద‌ల  చేసినట్లు లోక‌ల్  మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ పెంపుడు ప‌న్నుకు క‌ర్త‌ - క‌ర్మ - క్రియ‌....రాష్ట్ర మంత్రి నవజ్యోత్‌ సింగ్ సిద్దూ అని తెలుస్తోంది. అయితే, మీడియాలో వెలువ‌డ్డ క‌థ‌నాల‌పై ప‌లువురు మండిప‌డుతున్నారు. ఆఖ‌రికి స‌ర‌దాగా ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల‌పై కూడా ప‌న్ను విధించ‌డ‌మేమిట‌ని ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

కుక్క - పిల్లి - గుర్రం - పంది - బర్రె - ఆవు - ఏనుగు - ఒంటె - గుర్రం.. జంతువులన్నీ తాజా ప్ర‌భుత్వ ఆదేశాల పరిధిలోకి వస్తాయి. కోళ్లు - చిలుకలు - పావురాలు వంటి పక్షులకు ఈ నిబంధ‌న వర్తిస్తుందో స్పష్టత రావాల్సి ఉంది. అయితే, పంచాయితీలలోని ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. వారికి ప‌న్ను మినహాయింపునిచ్చింది. అయితే,  అన్ని మున్సిపాలిటీలలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. దాదాపు రూ.200 నుంచి రూ.500 రూపాయల వ‌ర‌కు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుందని, ఒకవేళ పన్ను కట్టకపోతే మున్సిపల్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటార‌ని తెలిపింది. మ‌రోవైపు, ఈ కొత్త నిబంధ‌న‌కు న్యాయ పరమైన చిక్కులు ఎదుర‌వ‌వ‌చ్చ‌ని కొంద‌రు అభిప్రాయపడుతున్నారు.  నోటిఫికేషన్‌ లో స్పష్టత లేనందునే కొంత గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. అసలు ఈ చట్టం అమలులోకి వచ్చిందా? అన్న విష‌యం తేలాల్సి ఉంది. జంతు ప్రేమికులు ఈ నిబంధనలపై మండిప‌డుతున్నారు. ఇంట్లో పెంచుకునే జంతువులపై పన్నులు విధించటమేంటని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  ఆ నిబంధ‌న అమ‌లులోకి వ‌స్తే .....డెయిరీ ఫామ్ లు నిర్వహించే వారి పరిస్థితిపూ ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గతంలో కూడా గోవా - కేరళలోనూ ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలే చేశాయి. అయితే, ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో అ నిబంధ‌న‌లు అమ‌లులోకి రాలేదు.
Tags:    

Similar News