బాబూ!... పురందేశ్వ‌రి మాట విన‌పడిందా?

Update: 2017-09-30 09:35 GMT
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత లోటు బ‌డ్జెట్‌ తో ప్ర‌యాణం ప్రారంభించిన న‌వ్యాంధ్ర‌కు కేంద్రం ఇతోదికంగా సాయం చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇది ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ మాటే కాదు.. రాష్ట్రానికి చెందిన రాజ‌కీయ పార్టీల‌తో పాటు కేంద్రంలో అధికారంలో బీజేపీ - విప‌క్షంలో ఉన్న ఇత‌ర పార్టీల‌ది కూడా ఇదే మాట‌. మ‌రి అధికారంలో ఉన్న పార్టీ కూడా న‌వ్యాంధ్ర‌కు ఇతోదికంగా సాయం చేయాల‌ని భావిస్తున్నా... రాష్ట్రానికి స‌కాలంలో నిధులు ఎందుకు రావడం లేదు? స‌కాలంలోనే కాకుండా రావాల్సిన నిధులు దాదాపుగా ఎందుకు ఆగిపోతున్న‌ట్లు? ఇదే విష‌యంపై ఎప్పుడు ప‌డితే అప్పుడు మాట్లాడే టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... నింద‌ను కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారుపైనే వేస్తుంటారు. మొన్న‌టికి మొన్న కూడా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని వ‌చ్చిన చంద్ర‌బాబు... కేంద్రం నుంచి ఆశించిన మేర నిధులు రావ‌డం లేద‌ని, ఇలాగైతే రాష్ట్రం బాగుప‌డ‌టం దుర్ల‌భ‌మ‌ని కూడా త‌న‌దైన శైలిలో ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయితే వాస్త‌వాల‌ను దాచేసి చంద్ర‌బాబు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఎప్ప‌టి నుంచో ఆరోపిస్తూ వ‌స్తున్న బీజేపీ నేత‌లు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు బాబుకు కౌంట‌ర్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా మొన్న‌టి బాబు ప్ర‌క‌ట‌న‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు బీజేపీకి చెందిన సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి రంగంలోకి దిగారు. బీజేపీ నేత‌గానే కాకుండా... చంద్రబాబుకు ద‌గ్గ‌రి బంధువు అయిన‌ పురందేశ్వరి ఆయ‌న ఆవేద‌న‌పై ఓ రేంజిలో ఫైర‌య్యార‌నే చెప్పాలి. అయినా బాబు కామెంట్ల‌పై పురందేశ్వ‌రి ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... రాష్ట్రానికి కేంద్రం నుంచి విడుద‌ల కావాల్సిన నిధుల్లో కొన‌సాగుతున్న జాప్యం, నిధుల ర‌ద్దుకు చంద్ర‌బాబు వైఖ‌రే కార‌ణ‌మ‌ని పురందేశ్వ‌రి కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఈ విష‌యంలో కేంద్రానిది కించిత్ కూడా పొర‌పాటు లేద‌ని తేల్చేసిన పురందేశ్వ‌రి... పాప‌మంతా చంద్రబాబుదేన‌ని పెద్ద దెబ్బే వేశారు.

కేంద్రం విడుద‌ల చేసిన నిధుల్లో సింగిల్‌ పైసాకు కూడా చంద్ర‌బాబు స‌ర్కారు లెక్క చెప్ప‌డం లేద‌ట‌. అస‌లు కేంద్రం నుంచి వ‌చ్చిన నిధుల‌ను ఏ ప‌నుల‌కు వినియోగించామ‌న్న విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు స‌ర్కారు చెప్ప‌డం లేద‌ని పురందేశ్వ‌రి ఆరోపించారు. మ‌రి ఇచ్చిన నిధుల‌కు లెక్క‌లు చెప్ప‌కుంటే... త‌దుప‌రి నిధుల‌ను ఎలా ఇచ్చేది అంటూ ఆమె ఓ కొత్త వాద‌న‌ను వినిపించారు. ఇలా లెక్క‌లు చెప్ప‌ని చంద్ర‌బాబు స‌ర్కారు వైఖ‌రిని పురందేశ్వ‌రి ప‌క్కా ఆధారాల‌తోనే బ‌య‌టపెట్టేశార‌నే చెప్పాలి. త‌న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి పోల‌వ‌రం అంశాన్ని ఉద‌హ‌రించిన పురందేశ్వ‌రి... ఇప్ప‌టిదాకా పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం విడుద‌ల చేసిన నిధుల్లో ఒక్క పైసాకు కూడా చంద్ర‌బాబు స‌ర్కారు లెక్క‌లు చెప్ప‌లేద‌ని పేర్కొన్నారు.

నిధుల‌కు లెక్క‌లు చెప్ప‌క‌పోవ‌డంతో పాటుగా ప్రాజెక్టు ప‌నులు చేప‌ట్టే కాంట్రాక్ట‌ర్ల‌ను త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మార్చేస్తోంద‌ని కూడా ఆమె చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. అంతేకాకుండా అప్ప‌టిదాకా ప‌నులు చేసి వైదొల‌గిన కాంట్రాక్ట‌ర్లు కూడా ఏ విధంగా ఖ‌ర్చు చేశార‌న్న విష‌యాన్ని కూడా చెప్ప‌డం లేద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీ ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న ఈ త‌ర‌హా వైఖ‌రి కార‌ణంగానే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం ఆల‌స్య‌మ‌వుతోంద‌ని పురందేశ్వ‌రి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే... న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం కేంద్రం విడుద‌ల చేసిన నిధుల‌కు కూడా బాబు స‌ర్కారు లెక్క‌లు చెప్ప‌డం లేద‌ని కూడా పురందేశ్వ‌రి మ‌రో బాంబు పేల్చారు. మ‌రి వ‌దిన‌మ్మ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు ఏ త‌ర‌హా స‌మాధానం ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News