పుతిన్ కు క్యాన్సర్... పార్కిన్సన్.. అధికారానికి దూరం..?

Update: 2022-05-03 12:30 GMT
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిట్ నెస్ కు మారు పేరు. 70 ఏళ్ల వయసులోనూ ఆయన ఎలా ఉన్నారో చూస్తేనే ఆ విషయం తెలిసిపోతోంది. మాజీ గూఢచారి అయిన పుతిన్ దేహం కండలు తిరిగి ఉంటుంది. జూడోలోనూ చాంపియన్ అయిన ఆయన అందుకుతగినట్లుగా  ఉంటారు. శారీరక ఫిట్ నెస్ తో వచ్చిన మానసిక ధైర్యంతోనే పుతిన్ రష్యాను మళ్లీ నిలబెట్టారు. సోవియట్ యూనియన్ పతనంతో రష్యా ఆర్థిక శక్తి సన్నగిల్లితే.. ఆ తర్వాత పదేళ్లలోపే పుతిన్ పగ్గాలందుకుని రష్యా సత్తా ఏమిటో చాటారు.

అంతా ఒక ఎత్తు.. దురాక్రమణ మరో ఎత్తు

ఉక్రెయిన్ పై రష్యా ఫిబ్రవరి 24న దురాక్రమణ మొదలుపెట్టాక పుతిన్ అంట ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది. యుద్ధం మొదలై రెండున్నర నెలలు అవుతున్నా.. పాశ్చాత్య దేశాల ఆంక్షలు తీవ్రం అవుతున్నా పుతిన్ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా మే 9 నాటికి ఉక్రెయిన్ టార్గెట్ ను పూర్తి చేయాలంటూ తన సైన్యాన్ని ఆదేశించారు. మే 9 అంటే.. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ పై రష్యా విజయం సాధించిన రోజు. దీనిని రష్యా విక్టరీ డే గా జరుపుకొంటారు. అందుకే ఆ రోజును పుతిన్ టార్గెట్ గా విధించారు. అయితే, ఇంతలో ఓ అనూహ్య పరిణామం.

తాత్కాలికంగా అధికారానికి దూర?

పుతిన్ కు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదంతా పశ్చిమ దేశాల మీడియా కట్టుకథగా కూడా భావించవచ్చు. అయితే, పుతిన్ కు క్యాన్సర్ ఉందని దాని చికిత్స కోసం కొద్ది రోజులు యద్ధం పర్యవేక్షణ నుంచి తప్పుకొంటారని బ్రిటన్ కు చెందిన గార్డియన్ పత్రిక పేర్కొంది.

పార్కిన్సన్ తోనూ పుతిన్ బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో పుతిన్ అధికారాన్ని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ నికోలాయ్‌ పట్రుషెవ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి అమెరికా వార్తా సంస్థ దీనిని ప్రస్తావించింది. పార్కిన్సన్ తో  పుతిన్ రూపం మారినట్లు పలు ఫొటోలు, వీడియోలు ఇప్పటికే వచ్చాయి.

ప్రధానిని కాదని పట్రుషెవ్ కు బాధ్యతలు

రష్యా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు విధులకు దూరమైతే ఆ బాధ్యతను ప్రధానికి అప్పగించాలి. కానీ, పుతిన్.. పట్రుషెవ్ కు కట్టబెట్టారు. కొద్ది రోజుల క్రితం ఆయనతో రెండు గంటల పాటు సంభాషించారు. అధ్యక్ష బాధ్యతలూ అప్పగిస్తారని అంటున్నారు. దీన్నిబట్టి ఆయన్ను పుతిన్ బాగా నమ్ముతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, పట్రుషెవ్ రష్యా  గూఢచార సంస్థ కేజీబీ మాజీ బాస్. క్రూరుడిగా పేర్కొంటారు. అయితే ఎక్కువరోజులు అధికారానికి దూరంగా ఉండటానికి పుతిన్‌ అంగీకరించకపోవచ్చు. ఆ సమయం రెండుమూడు రోజులు మించకపోవచ్చు అనే వాదనా వినిపిస్తోంది.

పట్రుషెవ్‌ సెక్రటరీగా ఉన్న సెక్యూరిటీ కౌన్సిల్ అత్యంత శక్తివంతమైనది. ఆ సంస్థ పుతిన్‌కు నేరుగా వివరాలు వెల్లడిస్తుంది. అలాగే ఆ దేశంలో సైనిక, భద్రతాపర అంశాలపై మార్గదర్శకాలు జారీ చేస్తుంది. పుతిన్ వలే నికొలాయ్ కూడా రష్యా ఇంటిలిజెన్స్ ఏజెంట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అధ్యక్షుడికి సన్నిహితుడిగా అందరికి సుపరిచితుడు. అతడు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా, దాని మిత్ర దేశాలపై తీవ్ర విమర్శలు చేశారు. కీవ్‌లోని తమ అనుచరులను ఉపయోగించుకొని అమెరికన్లు రష్యాను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Tags:    

Similar News