దేవుడిని వదిలేశాడు.. పుట్టా సంచలనం

Update: 2019-03-21 10:32 GMT
టీటీడీ చైర్మన్ పదవి అంటే మంత్రి పదవి కంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో భావిస్తారు. దానికోసం ఆరాటపడతారు. కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల వేంకటేశ్వరుడి దేవస్థానం చైర్మన్ పదవికి ఇప్పటికీ తెలుగునాట ఫుల్ గిరాకీ ఉంది. అయితే ఎమ్మెల్యే పదవి కోసం ఏకంగా టీటీడీ చైర్మన్ పదవికే రాజీనామా చేసి బరిలోకి దిగుతున్నారు పుట్టా సుధాకర్ యాదవ్.

పుట్టా సుధాకర్ యాదవ్.. స్వయంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు దగ్గరి బంధువు. ఆయన బాబును తిడుతాడు.. పుట్టా పొగుడుతాడు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కోసం ఉన్నట్లుండి టీటీడీ చైర్మన్ పదవిని త్యజించాడు పుట్టా. కడప జిల్లా మైదకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

టీటీడీ లాంటి నామినేడెట్ పదవి లో ఉండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగడానికి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఎమ్మెల్యే గిరీ కోసం ఏకంగా టీటీడీ చైర్మన్ పదవికే రాజీనామా చేశాడు పుట్టా. అయితే అంతటి ప్రతిష్టాత్మక పదవిని వదిలిపెట్టి ఎమ్మెల్యే స్థానం కోసం పుట్టా రావడాన్ని ఏపీ మంత్రి ఒకరు వారించినట్లు తెలిసింది. ఎన్నికల్లో పోటీకోసం ఇలా చేయవద్దని విన్నవించాడట.. కానీ పుట్టా ససేమిరా అని రాజీనామా చేసేయడం గమనార్హం.

టీటీడీ మెంబర్లుగా వ్యవహరిస్తున్న బీకే పార్థసారథి - బొండా ఉమామహేశ్వరరావు - రాయపాటి సాంబశివరావులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు వారి బాటలోనే పుట్టా కూడా రాజీనామా చేశారు. దీంతో టీటీడీ ధర్మకర్తల మండలి పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వమే నూతన టీటీడీ కొత్త బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బంగారం లాంటి టీటీడీ పదవిని వదిలేసి.. ఎమ్మెల్యే కోసం పుట్టా వైదొలడంపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Tags:    

Similar News