ఈసారి గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్టగుంట సతీష్!

Update: 2022-06-18 15:30 GMT
తమకు ఏకుకు మేకులా తయారైన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఓడించడానికి టీడీపీ అధిష్టానం గట్టి అభ్యర్థిపై దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో వైఎస్సార్సీపీతో కలిసి నడుస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీని ఓడించి తగిన బుద్ధి చెప్పడానికి టీడీపీ సిద్ధమవుతోంది. ఈసారి టీడీపీ తరపున గన్నవరం నుంచి లయన్స్ క్లబ్ గవర్నర్ పుట్టగుంట సతీష్ ను ఆ పార్టీ రంగంలోకి దించనుందని తెలుస్తోంది. పుట్టగుంట సతీష్ లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా ఆయనకు మంచి పేరుంది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే గన్నవరంలో వంశీకి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పుకుంటున్నారు.

టీడీపీ తరఫున గెలిచిన వంశీ వైఎస్సార్సీపీలోకి రావడాన్ని డీసీసీబీ చైర్మన్, గత ఎన్నికల్లో వంశీ మీద పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకించారు. గన్నవరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జిని తానేనంటూ యార్లగడ్డ వెంకట్రావు, ఆయన వర్గం వల్లభనేని వంశీని నియోజకవర్గంలో ప్రతి చోటా అడ్డుకుంది.

ఇంకోవైపు యార్లగడ్డ వెంకట్రావు మాత్రమే కాకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ స్నేహితుడు దుట్టా రామచంద్రరావు కూడా గన్నవరం నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితులుగా దుట్టా రామచంద్రరావుకు పేరుంది. ఆయనకు కూడా వల్లభనేని వంశీతో పొసగడం లేదు. దుట్టా రామచంద్రరావు అల్లుడు శివభరత్ రెడ్డి ప్రస్తుతం వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇలా గన్నవరంలో నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అటు యార్లగడ్డ వెంకట్రావు నుంచి.. ఇటు దుట్టా రామచంద్రరావు నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. రోజూ వీరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున మంచి వ్యక్తిగా పేరున్న పుట్టగుంట సతీష్ ను టీడీపీ తమ అభ్యర్థిగా రంగంలోకి దించుతోందని ప్రచారం జరుగుతోంది.

పుట్టగుంట సతీష్ పోటీ చేస్తే వల్లభనేని వంశీ ఓడిపోవడం ఖాయమేనని చెబుతున్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీమోహన్ పై రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని అంటున్నారు. మరోవైపు సొంత పార్టీలోనే తీవ్ర స్థాయి అసమ్మతి ఉన్న నేపథ్యంలో వంశీకి మరోమారు సీటు ఇస్తే ఆయనను యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వర్గాలు ఓడించడం ఖాయమని చెబుతున్నారు.
Tags:    

Similar News