ఈనెల 29న మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం.....రా జ‌గ‌న్ : ఎంపీ ర‌ఘురామ పిలుపు

Update: 2022-12-05 16:21 GMT
ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఈ నెల 29వ తేదీని మూక్కుమ్మ‌డి రాజీనామాలు చేద్దాం రా జ‌గ‌న్ అంటూ వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు చేసిన స‌వాల్ సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌త్యేక హోదా సాధన కోసం మొత్తం 25 మంది ఎంపీలం మూక్కుమ్మ‌డి రాజీనామా చేద్దాం, టీడీపీ ఎంపీల‌ను ఒప్పిందే బాధ్య‌త నాది, చంద్ర‌బాబును కాళ్ల‌వేళ్లా ప‌డి బ్ర‌తిమాలుదాం, ఆయ‌న ముగ్గురు ఎంపీల‌తో రాజీనామా చేయించే బాధ్య‌త నాది, దీనికి వైసీపీ అధినేత జ‌గ‌న్ సిద్ధ‌మేనా అని ప్ర‌శ్నించారు. ఢిల్లీలో  సోమ‌వారం సాయంత్రం చంద్ర‌బాబు నేతృత్వంలో జ‌రిగిన టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశానికి వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు హాజ‌రయ్యారు.

జీ-20 స‌ద‌స్సు స‌న్నాహ‌క స‌మావేశాల కోసం ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ అఖిల‌ప‌క్షం స‌మావేశం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొన‌డానికి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విప‌క్ష టీడీపీ  నేత చంద్ర‌బాబు నాయుడు ఇద్ద‌రూ కూడా ఢిల్లీకి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలో త‌న పార్టీ ఎంపీల‌తో స‌మావేశ‌మైన చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఎంపీల మూక్కుమ్మ‌డి రాజీనామాల అస్త్రం సంధించాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద‌గా చ‌ర్చ న‌డిచింది.

ఈ ప‌రిణామాల‌కు బ‌లం చేకూర్చేలా వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు ఈ స‌మావేశాల‌కు హాజ‌ర‌వ‌డ‌మే కాకుండా స‌మావేశం అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు మూక్కుమ్మ‌డి రాజీనామా చేయాల‌ని ప్ర‌తిపాదించిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు జ‌రుగుతున్న పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల చివ‌రి రోజు మ‌రోమారు ఎంపీల మూక్కుమ్మ‌డి రాజీనామాలకు ప్ర‌తిపాదించాల‌ని ర‌ఘురామ‌కృష్ణం రాజు డిమాండ్ చేశారు.

వై.ఎస్‌.జ‌గ‌న్ త‌న పార్టీకి చెందిన 22 మంది ఎంపీల చేత మూక్కుమ్మ‌డి రాజీనామాలు చేయిస్తే వారితోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయడానికి ఒప్పించే బాధ్య‌త నేను తీసుకుంటాన‌ని తెలిపారు. ఎంపీల మూక్కుమ్మ‌డి రాజీనామాల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేగ‌లుగుతామ‌న్నారు.

అవ‌స‌ర‌మైతే ఈ విష‌యంలో విప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడ్ని కాళ్లావేళ్లాప‌డి బ్ర‌తిమ‌లాడి ఆయ‌న పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసేలా ఒత్తిడి తెద్దామ‌న్నారు. ఎన్న‌కల‌కు ముందు ప్ర‌త్యేక హోదా నినాదం అందుకున్న ముఖ్య‌మంత్రి ఇప్పుడు దాన్ని విస్మ‌రించి 1937లో చేసిన శ్రీబాగ్ ఒప్పందాన్ని ముందుకు తీసుకురావ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు.

ర‌ఘురామ చేసిన తాజా వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News