రఘురామకృష్ణంరాజుపై ఐటీ పంజా?.. అబద్దమంటున్న ఎంపీ?

Update: 2020-10-08 13:40 GMT
కొద్దిరోజులుగా వైసీపీలో అసమ్మతి రాజేస్తున్న వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు గట్టి షాక్ తగిలిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.. జగన్ ఢిల్లీ పర్యటన ముగిసిన రోజు ఆయన ఇంటితోపాటు మరో ఏడు చోట్ల ఆయన ఆస్తులపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు సమాచారం. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయని తెలిసింది.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు చెందిన హైదరాబాద్ నివాసంతోపాటు మరో ఏడు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీతోపాటు ఆయన పలు రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఆరాతీస్తున్నట్టు తెలిసింది.

ఇందు,భారత్ సహా పలు కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లోనూ తాజాగా ఐటీ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ సోదాలు ఈ ఉదయం ఆరుగంటలకే మొదలు కాగా.. రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

కాగా ఐటీ దాడులపై ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. తన నివాసాలపై ఐటీ దాడులు టీవీల్లోనే చూస్తున్నానని.. అలాంటిదేమీ లేదని ఆయన వివరణ ఇచ్చారు. హైదరాబాద్ లో కానీ.. ఢిల్లీలో కానీ మా ఇంట్లో ఎలాంటి సోదాలు జరగలేదని.. అందుకు సంబంధించిన సమాచారం ఎవరూ ఇంతవరకు ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. దీనిపై అసలు నిజాలు అనేవి వెల్లడి కావాల్సి ఉంది. ఐటీ అధికారులు కూడా దీనిపై స్పందించాల్సి ఉంది.
Tags:    

Similar News