ముచ్చ‌ట‌గా మూడో రోజు రాహుల్ డుమ్మా!

Update: 2019-05-29 03:53 GMT
అధినేత‌కు ఆగ్ర‌హం వ‌స్తే ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. అందునా గాంధీల‌కు బ‌దులుగా మ‌రెవ‌రి సార‌థ్యాన్ని కోరుకోని కాంగ్రెస్ కు.. ఇప్పుడ‌దే గాంధీ ఫ్యామిలీకి చెందిన అధినేత‌.. పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటే నెల‌కొనే ప‌రిస్థితి ఎమిట‌న్న‌ది తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత‌ల్ని చూస్తే. ఇట్టే అర్థ‌మైపోతుంది. ఇటీవ‌ల వెల్ల‌డైన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మోడీ బంప‌ర్ మెజార్టీతో గెలుపొంద‌టం ఒక ఎత్తు అయితే.. తాను ఘోరంగా విఫ‌లం కావ‌టంపై రాహుల్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

పార్టీ ఓట‌మికి బ‌య‌ట కార‌ణాలు ఎన్ని ఉన్నాయో.. పార్టీ ప‌రంగా అలాంటి లోపాలు చాలానే ఉన్నాయ‌న్న భావ‌న‌తో ఆయ‌న ఉన్నారు. పార్టీ గెలుపు మీద కంటే ఎవ‌రికి వారు.. వారి వారి వ్య‌క్తిగ‌త గెలుపు మీద‌నే దృష్టి పెట్ట‌టంపై ఆయ‌న గుర్రుగా ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ భేటీలో ఈ విష‌యాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్ట‌ట‌మే కాదు.. ఎన్నిక‌ల వేళ‌.. టికెట్ల ఎంపిక విష‌యంలో కొంద‌రు అగ్ర‌నేత‌లు అనుస‌రించిన విధానాన్ని.. పేర్ల‌తో స‌హా చెప్పేసిన రాహుల్ సంచ‌ల‌న‌మే సృష్టించారు.

ఇలాంటి తీరుతో ఉంటే పార్టీ గెలుపు అవ‌కాశాలు ఎందుకు ఉంటాయ‌న్న విష‌యాన్ని తేల్చిన ఆయ‌న‌.. పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్ర‌క‌టించారు. దీంతో.. కాంగ్రెస్ నేత‌లు అవాక్కు అయిన ప‌రిస్థితి. ఓట‌మి వేద‌న‌లో ఉన్న రాహుల్ ను బుజ్జ‌గించొచ్చ‌న్న భావ‌న‌లో ఉన్న కాంగ్రెస్ నేత‌ల‌కు.. గ‌డిచిన మూడురోజులుగా త‌త్త్వం బోధ ప‌డుతోంది. తాను అన్న మాట‌కు త‌గ్గ‌ట్లే రాహుల్ పార్టీ ఆఫీసుకు రాకుండా.. తుగ్ల‌క్ రోడ్డులోని త‌న నివాసానికే ప‌రిమిత‌మ‌య్యారు.

సోద‌రి ప్రియాంక గాంధీతో స‌హా అత్యంత సన్నిహితులు కొంద‌రిని మాత్ర‌మే రాహుల్ క‌లిశారు. ఇప్ప‌టికి పార్టీ ప‌ద‌విని చేప‌ట్టేందుకు తాను సుముఖంగా లేన‌న్న విష‌యాన్ని త‌న‌ను క‌లిసిన వారికి స్ప‌ష్టం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌డిచిన మూడు రోజులుగా రాహుల్ గుర్రు వెనుక అస‌లు కార‌ణం మ‌రేదైనా ఉందా?  తాజా అల‌క ఆయ‌న దేని కోసం చేస్తున్న‌ట్లు?  కాంగ్రెస్ పార్టీని గాంధీ ఫ్యామిలీ కాకుండా మ‌రే నేత స‌రిగా డీల్ చేయ‌లేర‌న్న పాత పాఠాల్ని పార్టీ నేత‌లు ఎవ‌రూ మ‌ర్చిపోని ప‌రిస్థితి.

ఇలాంటి నేప‌థ్యంలో రాహుల్ ను ఏదోలా ఒప్పించాల‌న్న ప్ర‌య‌త్నాలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. రాహుల్ తాజా ఆగ్ర‌హం వెనుక అస‌లు కార‌ణం.. పార్టీని సంపూర్ణంగా ప్ర‌క్షాళన‌ చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఆయ‌న ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. పార్టీలో కొంద‌రు సీనియ‌ర్ల‌ను దారికి తేవ‌టంతో పాటు.. కాంగ్రెస్ మ‌నుగ‌డ‌కు గాంధీ కుటుంబం త‌ప్ప మ‌రెవ‌రూ లేర‌న్న విష‌యాన్ని ఆయ‌న స్ప‌ష్టం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

గ‌తంలో గాంధీల కుటుంబానికి సంబంధం లేని సీతారాం కేస‌రి పార్టీ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించ‌టం.. ఆ సంద‌ర్భంగా పార్టీ ఎదుర్కొన్న ఇబ్బందుల నేప‌థ్యంలో చివ‌ర‌కు సోనియాగాంధీని పార్టీ ప్ర‌ముఖులంతా ఒప్పించి మ‌రీ ఆమెకు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌టం తెలిసిందే. తాజా ఓట‌మి నేప‌థ్యంలో.. పార్టీలోని ప‌లువురు నేత‌లు త‌మ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ధోర‌ణికి చెక్ పెట్ట‌ట‌మే ల‌క్ష్య‌మ‌ని తెలుస్తోంది. మ‌రి.. ఈ అల‌క ఎపిసోడ్ ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి.
Tags:    

Similar News