మోడీ సెల‌క్ష‌న్‌ పై యువ‌రాజు ప్ర‌శంస‌లు

Update: 2017-04-05 09:06 GMT
అలాంటి వ్య‌క్తా యూపీకి ముఖ్య‌మంత్రి? అన్న ప్రశ్న‌.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా యోగి అదిత్య‌నాథ్ పేరును ప్ర‌క‌టించిన వెంట‌నే చాలామంది నోటి నుంచి వ‌చ్చిన మాట ఇది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ త‌ర‌చూ మీడియాలోకి వ‌చ్చే యోగిని ఎంపిక చేయ‌టం ద్వారా మోడీ పెద్ద త‌ప్పు చేస్తున్నార‌ని.. ఇలాంటి ఎంపిక ఏమిటంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వినిపించాయి. సామాన్యులు.. సోష‌ల్ మీడియాతో స‌హా రాజ‌కీయ‌పార్టీలు సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వినిపించాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన యోగి.. రోజుల వ్య‌వ‌ధిలోనే త‌న‌పై ఉన్న విమ‌ర్శ‌ల్ని తొల‌గించుకోవ‌ట‌మే కాదు.. కొత్త త‌ర‌హా యోగిని దేశ ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసి ఆశ్చ‌ర్యంలో ముంచేశారు.

అప్ప‌టివ‌ర‌కూ యోగి గురించి వ‌చ్చిన వార్త‌ల‌కు భిన్నంగా.. వివిధ వ‌ర్గాల వారితో యోగి ఎంత‌గా మ‌మేకం అవుతార‌న్న విష‌యంలో పాటు.. ఆయ‌న సంర‌క్ష‌కుడిగా ఉండే గోర‌ఖ్ నాథ్ పీటంలో ముస్లింల‌కు ఆయ‌నిచ్చే ప్రాధాన్య‌త లాంటి చాలానే విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అంతేనా.. నిజాయితీకి పెద్ద‌పీట వేస్తూ.. అవినీతి అధికారుల‌పై క‌న్నెర్ర చేయ‌టం.. పాల‌న‌ను వేగ‌వంతం చేయ‌టానికి ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు ఒక్కొక్క‌టి సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. మోగి సెల‌క్ష‌న్‌ను అంద‌రూ మెచ్చుకునే ప‌రిస్థితి.

ఇలాంటివేళ‌లో.. తొలి క్యాబినెట్ స‌మావేశాన్ని నిర్వ‌హించిన యోగి.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ ఇచ్చిన రుణ‌మాఫీ హామీపై సానుకూలంగా స్పందించ‌ట‌మే కాదు.. స‌హ‌కార సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల రుణాల్ని మాఫీ చేస్తూ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. రూ.36,359కోట్ల రుణాల్ని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. యోగి తీసుకున్న నిర్ణ‌యంపై కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అనూహ్యంగా స్పందించారు. యోగి నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఓప‌క్క బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తూనే.. యోగి స‌రైన మార్గంలో ప‌య‌నిస్తున్నారంటూ అభినందించ‌టం గ‌మ‌నార్హం.

యోగి స‌ర్కారు నిర్ణ‌యంతో బ్యాంకు రుణాల నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రైతుల‌కు పాక్షికంగా ఉప‌శ‌మ‌నం ల‌భించింద‌ని.. క‌ష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకునేందుకు రుణ‌మాఫీ ఇవ్వ‌టాన్ని కాంగ్రెస్ ఎప్ప‌డు మ‌ద్ద‌తు ఇస్తుందంటూ రాహుల్ ట్వీట్ చేశారు. బీజేపీ తీసుకున్న నిర్ణ‌యం సంతోషంగా ఉందంటూనే.. రైతుల స‌మ‌స్య‌ల్ని రాజ‌కీయం చేయొద్ద‌ని హిత‌వు ప‌లికారు. రైతుల క‌ష్టాల‌పై కేంద్రం రియాక్ట్ కావాల‌ని.. రాష్ట్రాల మ‌ధ్య వివ‌క్ష ప్ర‌ద‌ర్శించ‌కూడ‌ద‌ని చుర‌క‌లు అంటించారు. సీఎంగా ప‌గ్గాలు అందుకున్న స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే యోగి.. కాంగ్రెస్ ముఖ్య‌నేత నుంచి ప్ర‌శంస‌లు అందుకోవ‌టం విశేషంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News