కాంగ్రెస్ నేతలు ఈ దీపావళి పండగను భారీ ఎత్తున చేసుకునేందుకు రెడీ అయ్యారు. దేశ వ్యాప్తంగా నేతలు ఆనంద సందోహాల్లో ఇప్పటి నుంచే మునిగిపోయారు. వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యువరాజు - గాంధీల వారసుడు రాహుల్ గాంధీ అతి పెద్ద - పురాతన జాతీయ పార్టీ కాంగ్రెస్ కు త్వరలోనే అధ్యక్షుడు కాబోతున్నారు. ప్రస్తుతం సోనియా చేతిలో ఉన్న కాంగ్రెస్ పగ్గాలను దీపావళి అమావాస్య తర్వాత ఏ క్షణమైనా రాహుల్ కు అప్పగించి రిటైర్ అవ్వాలని సోనియా డిసైడ్ అయినట్టు స్పష్టమైంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ ఆదివారం వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు దీపావళిని ముందే చేసుకున్నాయి.
ఇక, ఈ సందర్భంగా సచిన్ పైలట్ మాట్లాడుతూ.. రాహుల్ పై విమర్శలను తోసిపుచ్చారు. 'సర్ నేమ్ అనేది ఒక నేతను కొంతవరకూ తీసుకురావచ్చు. అంతిమంగా ఆ నాయకుని విలువ ఏమినటేది అతని ప్రతిభమీదే ఆధారపడి ఉంటుంది' అని సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయని, కొత్త అధ్యక్షుడు దీపావళి తర్వాత పగ్గాలు చేపడతారని తెలిపారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి ఇదే తగిన సమయమనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోందన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడుగా రాహుల్ చాలా కష్టపడ్డారని, అయితే పదోన్నతి సరైన సమయంలో జరగాలని పార్టీ అభిప్రాయంగా ఉంటూ వచ్చిందని తెలిపారు.
ఇక, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ గా రంగంలోకి దిగుతారని వస్తున్న వార్తలపైనా పైలట్ స్పందించారు. ``ఆమె కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే అయినప్పటికీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది`` అని అన్నారు. పనితీరు ఆధారంగానే ఎవరినైనా విజయం వరిస్తుందని ఆయన చెప్పారు. వారసత్వ రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందంటూ బీజేపీ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఆ పార్టీలోనూ రాజకీయాలతో మమేకమైన కుటుంబాల నుంచి వచ్చిన వారు చాలా మందే ఉన్నారని, బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని హితవు పలికారు. మొత్తానికి పైలట్ ప్రకటనతో కాంగ్రెస్ లో కొత్త ఊపు కనిపించింది. ఈ దీపావళిని వినూత్నంగా జరుపుకోవాలని శ్రేణులు ఇప్పటికే ప్రిపేర్ అయిపోవడం గమనార్హం. మరి రాహుల్ మనసులో మాట ఏంటో తెలియాలంటే.. కొంచెం వెయిట్ చేయాల్సిందే!