యువ‌రాజు... రాజ‌య్యాడు!

Update: 2017-12-16 07:23 GMT
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ లో అధికార ప‌గ్గాల మార్పిడి కాసేప‌టి క్రితం లాంఛ‌నంగా జ‌రిగిపోయింది. ఇటీవ‌ల పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి జరిగిన ఎన్నిక‌ల్లో పార్టీ ఉపాధ్య‌క్షుడి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ మిన‌హా.. అధ్య‌క్ష ప‌ద‌వికి ఏ ఒక్క‌రు కూడా నామినేష‌న్ వేయ‌లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నూత‌న అధ్య‌క్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు పార్టీ ఎల‌క్ష‌న్ ప్యానెల్ ప్ర‌క‌టించింది. అయితే గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పూర్తిగా నిమ‌గ్న‌మై ఉండ‌టం - మంచి ముహూర్తం కోసం వేచి చూడ‌టం వంటి కార‌ణాల‌తో పార్టీ అధ్య‌క్ష బాద్య‌త‌ల‌ను స్వీక‌రించేందుకు నేటి ముహూర్తాన్ని రాహుల్ ఎంచుకున్నారు. కాసేప‌టి క్రితం ఢిల్లీలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ప‌దవీ బాధ్య‌త‌లు స్వీకరించారు.

ఇప్ప‌టిదాకా పార్టీ అధినేత్రిగా కొన‌సాగుతున్న త‌న త‌ల్లి సోనియా గాంధీ నుంచే ఆయ‌న పార్టీ ప‌గ్గాల‌ను స్వీక‌రించారు. నిన్న‌టిదాకా పార్టీకి ఉపాధ్య‌క్షుడి స్థానంలో ఉన్న రాహుల్‌ను అంతా ఆ పార్టీ యువ‌రాజుగా అభివ‌ర్ణించేవారు. తాజాగా పార్టీ అధ్య‌క్ష పీఠంపై కూర్చున్న రాహుల్‌ను యువ‌రాజు నుంచి రాజుగా ప్ర‌మోష‌న్ పొందిన నేత‌గా చెప్పుకుంటున్నారు. రాహుల్ గాంధీకి పార్టీ ప‌గ్గాలు అప్పగించిన త‌ర్వాత కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన సోనియా గాంధీ... ఇక‌పై పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో ముందుకు సాగుతుంద‌ని పేర్కొన్నారు.

త‌న‌కు స‌హ‌కారం అందించిన‌ట్లుగానే రాహుల్ గాంధీకి కూడా నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వెన్నంటి న‌డ‌వాల‌ని, రాహుల్‌కు పూర్తి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని కూడా ఆమె పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. అవస‌ర‌మైన స‌మ‌యంలో రాహుల్ గాంధీకి త‌న స‌ల‌హాలు - సూచ‌న‌లు కూడా అందుతూనే ఉంటాయ‌ని సోనియా చెప్పుకొచ్చారు. కార్య‌క్ర‌మం కాస్తంత నిరాడంబ‌రంగానే జ‌రిగినా... దేశ‌వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వ‌చ్చిన‌ట్లుగానే క‌నిపిస్తోంది. రాహుల్ గాంధీ పార్టీ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న శుభ త‌రుణాన్ని పుర‌స్క‌రించుకుని దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నాయి.
Tags:    

Similar News