బెంగళూరుకు ఇంత కష్టమా? విరుచుకుపడిన వర్షంతో అంత భారీ నష్టమట

Update: 2022-09-06 01:30 GMT
కొన్నిసార్లు అంతే. చాలా తీవ్రమైన కష్టం చోటు చేసుకున్నా మీడియా పెద్దగా పట్టించుకోదు. మరికొన్నిసార్లు మాత్రం చిన్న వాటికి కూడా తీవ్రంగా స్పందిస్తూ పెద్ద ఎత్తున హడావుడి చేస్తుంటారు. ఆదివారం రాత్రి బెంగళూరు మహానగరంలో కురిసిన వానతో గార్డెన్ సిటీ గజగజ వణికిపోయింది. భారీగా కురిసిన వానతో ఐటీ కారిడార్ మొత్తంగా మునిగిపోయిన పరిస్థితి. ఒక పూట కురిసిన వానతో గార్డెన్ సిటీ మొత్తం గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఆదివారం సాయంత్రం తర్వాత మొదలైన వర్షం అదే పనిగా కురుస్తూ.. రాత్రంతా వాన పడుతూనే ఉంది. సెలవు రోజు కావటంతో పలువురు ఇళ్లకే పరిమితం కావటంతో బయట కురుస్తున్న వర్షపు తీవ్రత బయట వారికి తెలిసింది లేదు.

కొద్ది గంటల అనంతరం ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. అది కాస్తా ఎక్కువై.. భరించలేని స్థితికి చేరుకుంది. రోడ్ల మీద పార్కు చేసిన టూవీలర్లు వర్షం కారణంగా పోటెత్తిన వరదతో కొట్టుకుపోతే.. కరెంటు కష్టాలు మొదలయ్యాయి.

భారీగా కురిసిన వానతో కరెంటు కట్ చేశారు. దీంతో అపార్టు మెంట్ వాసుల కష్టాలు అన్ని ఇన్ని కావన్నట్లుగా మారింది. ఎవరికి వారు.. తమ ప్రాంతంలో కురిసిన వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లోనూ వీడియోలు షేర్ చేయటంతో ఇంతటి తీవ్ర పరిస్థితులు ఉన్నాయా? అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. భారీ వర్షం కారణంగా రోడ్లు మొత్తం తటాకాలు మాదిరి మారిపోగా.. చాలా అపార్టు మెంట్ల బేస్ మెంట్లలో వరద నీరు చేరుకోవటంతో తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి.

దీంతో అధికారులు.. పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఎంతో అవసరం ఉంటే తప్పించి ఇంట్లో నుంచి బయటకు రావొద్దన్న హెచ్చరికలు చేశారు. భారీ వర్షం కారణంగా బెంగళూరు ఐటీ కారిడార్ మొత్తం మునిగిపోయినట్లుగా చెబుతున్నారు.

అమెజాన్.. ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలు తమ ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయాలని కోరుతున్నాయి. వర్షాల కారణంగా ఐటీ కార్యాలయాలకు దాదాపు రూ.225 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు.  వర్షం ఏమో కానీ.. గార్డెన్ సిటీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News