చిత్తూరులో ‘రాజ రాజ చోర’ సినిమాకు మించిన సీన్!

Update: 2021-09-13 06:34 GMT
ఈ మధ్యనే థియేటర్లలో సందడి చేసిన సినిమాల్లో మంచి టాక్ సంపాదించిన చిత్రం ‘రాజ రాజ చోర’. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. చిన్న సినిమాల కోసం థియేటర్లకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేకపోవటం తెలిసిందే. దీనికి తోడు.. సినిమా ఏదైనా సరే.. విడుదలైన నెల కూడా కాక ముందే కొన్ని సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. సినిమా బాగుందన్న టాక్ వస్తున్నప్పటికీ థియేటర్లకు రావటానికి పెద్దగా ఇష్టపడని పరిస్థితి.

ఇక.. ఈ సినిమాలో అనుకోని పరిస్థితుల్లో దొరికిన హీరోను.. ఆ ప్రాంతానికి చెందిన పోలీసు అధికారి తానే స్వయంగా దొంగతనాలు చేయిస్తుంటాడు. ఇప్పుడు చెప్పే ఉదంతంలో దీనికి మరో అడుగు ముందుకు వేశారు. సినిమాలో పోలీసు అధికారి స్వయంగా హీరో చేత దొంగతనాలు చేస్తూ.. తాను పర్యవేక్షిస్తుంటాడు. తాజాగా మాత్రం చిత్తూరు పట్టణంలోని వేలూరు రోడ్డులో ఒక ఎస్ఐ.. పోలీసు కానిస్టేబుల్ స్వయంగా దొంగల అవతారం ఎత్తారు.

తాజాగా ఒక బట్టల షాపులో చోరీ జరిగింది. అయితే.. షాపులో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ చూసిన వారు ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. కారణం.. షాపులో చోరీ చేసింది మరెవరో కాదు.. శాంతిభద్రతల్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరించే ఎస్ఐ.. పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి దొంగల్ని మించిపోయారు.

ఈ ఉదంతం షాకింగ్ గా మారటమే కాదు.. పెను సంచలనంగా మారింది. దీంతో ఎస్ఐ మహమ్మద్.. కానిస్టేబుల్ ఇంతియాజ్ లను జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ సస్పెండ్ చేశారు. అంతేకాదు.. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి.. రిమాండ్ కు తరలించారు. పోలీసే దొంగలుగా మారిన వైనం చిత్తూరు పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యన రాజ రాజ చోర మూవీ చూసినోళ్లు మాత్రం.. అచ్చం ఆ సినిమాలో మాదిరే అంటూ మాట్లాడుకోవటం కనిపిస్తోంది.
Tags:    

Similar News