స్టేటస్ కో ఫాలో కావాల్సిందే ... చైనాకి వార్నింగ్ : రాజ్‌ నాథ్ సింగ్!

Update: 2020-09-15 14:00 GMT
ల‌డాఖ్‌ లో ఉన్న ప‌రిస్థితిపై దేశ ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు లోక్ ‌స‌భ ‌లో ప్ర‌క‌ట‌న చేశారు. దేశ ప్ర‌జ‌లంతా సైనికుల వెంటే ఉంటార‌ని ప్ర‌ధాని మోదీ ఆశాభావం వ్య‌క్తం చేసిన విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ మధ్య ల‌డాఖ్ వెళ్లిన‌ట్లు చెప్పిన ర‌క్ష‌ణ మంత్రి, సైనికుల‌ సాహ‌సం, శౌర్యాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసాన‌ని, క‌ల్న‌ల్ సంతోష్‌బాబు మాతృభూమి సేవ‌లో ప్రాణ‌త్యాగం చేశార‌న్నారు. చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదాలు ఇంకా అప‌రిష్కృతంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్పుడున్న వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దులు స్పష్టంగా లేవని చైనా నమ్ముతోందని... కానీ స్టేటస్ కోని ఫాలో కావాల్సిందేనని తాము హెచ్చరించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఎల్ఏసీ వెంబడి చోటు చేసుకునే ఏ చర్య అయినా ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది అని అన్నారు.

గత ఏప్రిల్ నుంచి ఎల్‌ఏసీ వెంబడి చైనా తమ బలగాలను పెంచుకుంటూ పోతుందని అన్నారు. సరిహద్దులో చైనా దుందుడుకు చర్యలను నియంత్రించేలా దౌత్యపరంగా, మిలటరీ పరంగా భారత్ ఇచ్చిన వార్నింగ్ విజయవంతమైందన్నారు. ఏకపక్షం గా స్టేటస్ కోని మార్చే ప్రయత్నం చేస్తే ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించినట్లేనని చైనాను హెచ్చరించినట్లు తెలిపారు. ఎల్ ఏ సీ వెంట శాంతి కోసం 1988 నుంచి రెండు దేశాల మ‌ధ్య సంబంధాల్లో అభివృద్ధి జ‌రిగిన‌ట్లు మంత్రి తెలిపారు. గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా బలగాలు దుందుడకు చర్యలకు పాల్పడ్డాయని చెప్పారు.

తూర్పు లదాఖ్‌లోని గోగ్రా,కొంగ్కా లా,పాంగాంగ్ దక్షిణ తీరం,పాంగాంగ్ ఉత్తర తీరం వెంబడి చైనా తమ బలగాలను పెద్ద ఎత్తున మోహరించిందన్నారు. దానికి కౌంటర్‌గా భారత్ కూడా అంతే స్థాయిలో మన బలగాలను మోహరించిందన్నారు. సరిహద్దులో భారత్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. దౌత్య‌, సైనిక ప‌ద్ద‌తుల్లో చైనాకు భార‌త్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. స‌రిహ‌ద్దు వెంట ఉన్న సున్నితత్వాన్ని స‌భ అర్థం చేసుకుంటుంద‌ని భావిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. సైనిక ద‌ళాల త్యాగాల‌ను ప్ర‌శంసించాల‌న్నారు. గ‌త కొన్నేళ్ల నుంచి స‌రిహ‌ద్దుల్లో మౌళిక స‌దుపాయాల‌ను పెంచుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. చైనా ద‌ళాలు హింసాత్మ‌క ధోర‌ణితో ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోపించారు. ఘ‌ర్ష‌ణాత్మ‌క ప్రాంతాల్లో భార‌త్ కూడా త‌మ బ‌ల‌గాల‌ను మోహ‌రించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. సరిహద్దు నిర్వహణ పట్ల భారత బలగాలు ఎప్పుడూ బాధ్యతాయుతంగా మెలుగుతున్నాయని... అయితే దేశ సమగ్రను,సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. అయితే, పరిస్థితులు మారిపోతున్న తరుణంలో ఇప్పటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నప్పటికీ... ఇప్పటికీ శాంతియుత సామరస్యానికే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Tags:    

Similar News