అడుగు దూరంలో సరికొత్త చట్టం

Update: 2016-12-15 04:38 GMT
పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో రాజకీయపక్షాలు ఎంత ఆగ్రహంగా ఉన్నాయో తెలిసిందే. అధికారపక్షంలోని రాజకీయ పక్షాలు కొన్ని అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. వారికున్న పరిమితుల పుణ్యమా అని నోరు విప్పని పరిస్థితి. ఇదిలా ఉంటే.. విపక్షాలు మోడీ సర్కారుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. కత్తులు దూస్తున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ సన్నివేశం భారీగా ఆవిష్కృతమైంది కూడా.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ ఒక్కరోజంటే.. ఒక్క రోజు కూడా సజావుగా జరగని పరిస్థితి. మోడీ సభకు వచ్చినా.. సభకు రాకున్నా.. సభాకార్యకలాపాలు జరగటం లేదు. పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షం.. అధికారపక్షంపై నిరసనలతో సభ జరగకుండా అడ్డుకుంటోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సమావేశాల్లోఒక బిల్లును ఆమోదించారు. నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో అధికారపక్షంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విపక్షాలు.. ఒక బిల్లు విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటమే కాదు.. ఐకమత్యంతో సదరు బిల్లుకు ఆమోదముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘‘దివ్యాంగుల హక్కుల బిల్లు 2014’’ను తాజాగా రాజ్యసభ ఆమోదించింది. మరో మూడు రోజుల్లో శీతాకాల సమావేశాలు ముగిసే అవకాశం ఉన్న వేళ.. అనూహ్యంగా ఈ బిల్లు ఆమోదానికి విపక్షాలన్నీ అధికారపక్షానికి తమ మద్దుతును పలికాయి.

తాజాగా ఆమోదం పొందిన బిల్లు.. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన వెంటనే చట్టంగా మారనుంది. దివ్యాంగుల రక్షణ.. వారి హక్కుల్ని పరిరక్షించే అవకాశం కల్పించే ఈ బిల్లు.. చట్టంగా మారిన వెంటనే.. వారి విషయంలో ఎవరైనా చులకనగా మాట్లాడినా.. వివక్ష ప్రదర్శించినా.. కనీసం 6 నెలల నుంచి రెండేళ్ల వరకూ జైలుశిక్షను విధిస్తారు. అదే సమయంలో రూ.10వేల నుంచి రూ.5లక్షల వరకూ జరిమానా విధించే వీలుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News