మీడియాను చూసి పారిపోయిన ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌

Update: 2017-01-13 16:37 GMT

పెద్ద నోట్ల రద్దు అనంతరం మీడియాకు వీలైనంత దూరంగా ఉంటున్న ఆర్‌ బీఐ గవర్నర్‌ ఉర్జీత్‌ పటేల్‌ మీడియా అంటేనే ఉలిక్కిపడుతున్నారు. గుజ‌రాత్‌లోని గాంధీనగర్‌లో వైబ్రాంట్‌ గుజరాత్‌ సదస్సుకు హాజరైన ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జీత్‌ పటేల్‌ ఆద్యంతం మీడియా ప్రశ్నలను తప్పించుకునేందుకు ప్రయత్నించారు. సదస్సులో కీలకోపన్యాసం చేసిన తర్వాత మీడియా ప్రతినిధులకు ఎలాంటి ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా పరుగుపరుగున తన వాహనంలోకి చేరుకున్నారు. సెమినార్‌ హాల్‌లోని ప్రవేశద్వారం వద్ద పెద్దసంఖ్యలో మీడియా ప్రతినిధులు తన కోసం వేచిచూస్తున్నారని పసిగట్టిన పటేల్‌ వారి కంటపడకుండా వెనుక ద్వారం నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయారని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కారు వద్దకు పరుగులు తీశారు. పాత్రికేయులు తన వాహనం వద్దకు చేరుకునేలోగానే ఉర్జీత్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆర్‌బీఐ అధిప‌తిగా స‌మాధానం ఇవ్వాల్సి ఉన్న నేప‌థ్యంలో నోట్ల ర‌ద్దు తర్వాత ఉర్జిట్ ప‌టేల్ మీడియాతో ముచ్చ‌టించ‌గా ఆ వ్యాఖ్య‌లు వివాదాస్పదంగా మారాయి. దీంతో కేంద్ర‌ప్ర‌భుత్వం ఆయ‌న్ను ప‌క్క‌న‌పెట్టి కేంద్ర ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత దాస్ తో నోట్ల ర‌ద్దు-త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై మాట్లాడించింది. ఈ క్ర‌మంలో తాజాగా మీడియా అంటేనే ఉర్జిత్ ప‌రుగులు పెట్ట‌డం ఆస‌క్తిక‌రం. ఇదిలాఉండ‌గా... కరెన్సీ కొరతతో దేశవ్యాప్తంగా ప్రజలు నానా అగచాట్లు పడుతుంటే భరోసా ఇవ్వాల్సిన కేంద్ర బ్యాంక్‌ ఉన్నతాధికారి మీడియాకు ముఖం చాటేస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News