లోకేష్‌ను రాజ్య‌స‌భకు ఎందుకు పంప‌లేదంటే...

Update: 2016-06-11 14:52 GMT
దేశంలో అత్యున్న‌త పెద్ద‌ల స‌భ అయిన రాజ్య‌స‌భ ఎన్నిక నేటితో ముగిసిపోతోంది. గ‌త మే 31తో 57 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. దీంతో వీటికి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కాగా 30 ఏకగ్రీవం ఎంపీలు ఎన్నిక‌య్యారు. మ‌రో 27 స్థానాలకు ఎన్నికలు ఫ‌లితాలు నేడు విడుద‌ల అవుతున్నాయి. ఈ క్ర‌మంలో తెలుగు రాష్ర్టాల్లో బ‌లంగా ఉన్న టీడీపీ నుంచి ఆ పార్టీ యువ‌నేత నారా లోకేష్ పేరు తెర‌మీద‌కు రాగా వ‌చ్చినంత వేగంగానే ఆయ‌న పేరు తెర‌వెన‌క్కు వెళ్లింది. దీనిపై టీడీపీ శ్రేణులు ఆస‌క్తిక‌ర‌మైన వాద‌న వినిపిస్తున్నారు.

నారా లోకేష్‌ ను రాజ్య‌స‌భ ద్వారా ఎంపీగా చేసి అనంత‌రం కేంద్ర మంత్రి చేయ‌డం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి క్రియాశీలంగా పాటుప‌డ‌వ‌చ్చ‌ని టీడీపీకి చెందిన ప‌లువురు నాయ‌కులు చంద్ర‌బాబు వ‌ద్ద త‌మ మ‌నోభావం వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌తిపాద‌న‌లో భాగంగా లోకేష్‌ ను రాజ్యసభకు పంపాలనే ఆలోచనలో చంద్రబాబు ప‌రిశీల‌న‌లో ఉండగా, ఆ ఆలోచనకు స్వస్తిచెప్పాలని పార్టీకి చెందిన కొంద‌రు సీనియ‌ర్ నేతలు బాబుకు సూచించినట్లు తెలియవచ్చింది. ఒకవేళ లోకేష్‌ కు రాజ్యసభ సీటు ఇస్తే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా - నిధుల విషయంలో జాప్యం చేస్తున్నందున ఆ ప్రభావం లోకేష్‌ పై ఉంటుందని స‌ద‌రు సీనియ‌ర్లు విశ్లేషించారని స‌మాచారం. ఈ జాప్యం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు - నారా లోకేష్‌ ల వైఫల్యంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రచారం చేయవచ్చనే భావనను వ్య‌క్తం చేశారు. దీంతో లోకేష్‌ ను పెద్ద‌ల స‌భ‌కు పంపించాల‌నే ప్ర‌తిపాద‌న‌ను నిలిపివేసిన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News