పవన్ కు కామ్రేడ్ల అవసరం ఎందుకు..?

Update: 2016-12-02 05:03 GMT
తెల్లనివన్నీ పాలు.. నల్లనివన్నీ నీళ్లు కానట్లే.. కంటి ముందు కనిపించేవన్నీ నిజాలు ఎంతమాత్రం కాదు. నమ్మరు కానీ మన కళ్లు మనల్నే మోసం చేస్తుంటాయి. అలాంటిది తెర వెనుక గుట్టుగా సాగిపోయే అంశాలు బయటకు రావాల్సిన అవసరమే ఉండదు. తెలుగు నేల మీద కొద్దిమంది సెలబ్రిటీలు.. ముఖ్యులు ఉంటారు. వారికి సంబంధించిన వార్తలు.. వివరాలు అస్సలు బయటకు రావు.

అస్సలు వారి వద్దకు వెళ్లేందుకు అవకాశం లేని పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటారు. కొద్ది మందికి మాత్రమే తమతో యాక్సిస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలా జాగ్రత్తలు తీసుకొని.. ఆచితూచి వ్యవహరించే వారిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకరు. పార్టీని ఏర్పాటు చేయటం మొదలు.. ఆ పార్టీని 2019 ఎన్నికల్లో బరిలోకి దింపుతానని తనకు తాను ప్రకటించే వరకూ ఆ విషయాలేవీ బయటకు రానే రావు.

నిత్యం డేగ కళ్లు వేసుకొని.. చీమ చిటుక్కుమన్నా బిలబిల మంటూ మూగిపోయే టీవీ గొట్టాలన్నీ కూడా.. ఈ మధ్య కాలంలో సంఘటనలు జరిగిన తర్వాతే ఆ విషయాన్ని టెలికాస్ట్ చేస్తున్నాయే కానీ.. ముందస్తుగా మాత్రం ఎలాంటి సమాచారం వారి వద్ద ఉండటం లేదు. టీవీ గొట్టాలకే కాదు.. పేపరోళ్లది కూడా అదే పరిస్థితి. ఎందుకిలా అంటే.. దాని లెక్కలు దానికి చాలానే ఉన్నాయని చెప్పాలి.

మీడియాను అంటీముట్టనట్లుగా ఉంటూ.. అవసరానికి మాత్రం.. తనకు తోచినప్పుడు మాత్రమే మీడియాను దగ్గరకు పిలుచుకునే అలవాటున్న పవన్ కల్యాణ్.. ఈ మధ్యన మాత్రం అందరికి కాస్త కలిసే అవకాశం ఇస్తున్నారు. అదే సమయంలో.. తనతో చర్చలు జరపటానికి వచ్చే వారికి సంబంధించిన వివరాలతోపాటు.. తనకు సంబంధించిన సమాచారం తరచూ మీడియాలో కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మధ్యన పవన్ కు అండగా ఉన్నట్లుగా కమ్యూనిస్టు నేతలు మాట్లాడటం కనిపిస్తోంది. గతంలో పవన్ కల్యాణ్ ఏమైనా సభ పెడితే చాలు.. కమ్యూనిస్టులు ఓ రేంజ్లో వేసుకునే వారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది ఉన్నా.. పవన్ మాట్లాడే ప్రతి మాటను కమ్యూనిస్టులు తప్పు పడతారంటే దాని లెక్క దానికి ఉందని చెప్పాలి. మిగిలిన రాజకీయ పార్టీల్ని కమ్యూనిస్టులు తిట్టటం.. వాటిని ప్రజలు చదవటం మానేసి చాలాకాలమే అయ్యింది. పవన్ అంటే యూత్ లో ఉండే క్రేజ్ ఏమిటో తెలిసిందే. ఆయన్ను కానీ టార్గెట్ చేస్తే చాలు.. 30 సెకన్ల విజువల్ కాస్తా మూడునిమిషాల పాటు టెలికాస్ట్ చేసే అవకాశం ఉన్నప్పుడు.. పవన్ ను తిట్టే ఛాన్స్ ఎందుకు వదులుకుంటారని చెబుతుంటారు. అందుకే కామ్రేడ్స్ తో పెట్టుకునే కన్నా. .వారితో స్నేహం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటన్నది పవన్ కు బాగా తెలుసు. కమ్యూనిస్టులతో స్నేహంగా ఉంటే లాభం.. జనసేన విస్తరణకు సంబంధించి ఏర్పాట్లతో పాటు.. రెండు విపక్షాలు తన వెంట ఉన్నప్పుడు.. తాను ఒక్కడిని కాదు ముగ్గురు అన్న మాట బలం వల్ల వచ్చే ఇమేజ్ వేరుగా ఉంటుంది. అందుకే.. కమ్యూనిస్టులతో కలిసి పని చేసే విషయంలో పవన్ సానుకూలంగా ఉన్నారని చెప్పొచ్చు.

ఇక.. కమ్యూనిస్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీతో కలిసినా.. వారికి ఇబ్బందే. ఎందుకంటే అదర్శాలు వల్లించే పార్టీలన్నీ ఎంతోకొంత ఆరోపణల్ని మూటగట్టుకున్నవే. ఇలాంటప్పుడు వారితో చెట్టాపట్టాలు వేసుకునే కన్నా.. జనాదరణ విపరీతంగా ఉన్న పవన్ కల్యాణ్ లాంటి నేతతో జత కలిస్తే.. బలమైన సామాజిక వర్గాన్నిఆకర్షించే వీలుంది. అంతేనే.. కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకట్రెండుతరాల వెనుకనే ఆగిపోయాయని.. ఆ పార్టీలో యువత ప్రాతినిధ్యం తక్కువన్న విమర్శ తెలుగు నేల మీద విస్తృతంగా ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు పవన్ స్నేహం అక్కరకు వస్తుందన్న అభిప్రాయం ఉంది. మొత్తంగా ఉభయ తారకంగా ఉండే ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. సరైన ఆసరా కోసం చూస్తున్న కామ్రేడ్స్ కు పవన్ రూపంలో వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లుందని చెప్పాలి.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News