గంటాను గెలిపించింది వాళ్లేనట..!

Update: 2019-06-02 11:05 GMT
గంటా శ్రీనివాస్ రావు.. ఎన్నికల్లో గెలుపు గుర్రం.. ఈయన బరిలోకి దిగడాంటే గెలవాల్సిందే.. వరుసగా ఐదో సారి గెలిచి ఔరా అనిపించాడు. ప్రతీ సారి నియోజకవర్గం మార్చి విజయం సాధిస్తున్నారు ఈయన.. 1999లో టీడీపీ నుంచి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. 2004లో టీడీపీ నుంచి చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో చిరంజీవి స్థాపించిన  ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు.  ఇక 2014లో టీడీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఇప్పుడు విశాఖ ఉత్తరం నుంచి పోటీచేసి గెలిచారు. ఇలా ఐదు సార్లు వరుసగా గెలిచిన నేతగా రికార్డులకు ఎక్కారు.

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం వీచింది. అయినా దాన్ని తట్టుకొని గెలిచారు గంటా.. టీడీపీకి గెలిచిన విశాఖలోని నాలుగు సీట్లలో విశాఖ ఉత్తరం నుంచి పోటీచేసి గెలిచారు గంటా. 2009 నుంచి అక్కడ టీడీపీ గెలవకపోవడం విశేషం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వ్యూహాత్మకంగా చేరి మంత్రి పదవులు చేజిక్కించుకోవడం గంటా స్పెషాలిటీ.. ప్రతీ ఎన్నికకు నియోజకవర్గాన్ని మార్చేస్తుంటారీయన.. పోల్ మేనేజ్ మెంట్.. ఎన్నికల వ్యూహాల్లో గంటా దిట్టా. ప్రత్యర్థులు సైతం ఈయన క్యాంపెయిన్ ను అభినందిస్తుంటారు.

గంటా గెలుపునకు డిసైడ్ చేసేది ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసే టీమేనట.. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు పోల్ మేనేజ్ మెంట్ అంతా ఆ టీమే చేస్తుందట.. ప్రత్యర్థి పార్టీల నేతలను తమవైపు తిప్పుకోవడం.. సామాజిక సమీకరణాలు.. ప్రజల అవసరాలు తీర్చేలా ఎత్తులు పై ఎత్తులు వేయడం చేస్తుంటారు.  ఇలా తన వెనుక తన ఫ్రెండ్స్ - తన స్పెషల్ టీం అంతా చూసుకుంటుందని గంటా తాజా ఇంటర్వ్యూలు  చెప్పుకొచ్చాడు.

ఈ ఎన్నికల్లో ప్రతీ రౌండ్ లోనూ గంటాకు చమటలు పట్టాయి. వైసీపీ అభ్యర్థి కేకే రాజు తొలి రౌండ్ లోనే ఆధిక్యం ప్రదర్శించాడు. తరువాత గంటా మెజారిటీ పడుతూ లేస్తూ కొద్ది తేడాతోనే చివరకు చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా 1944 ఓట్ల తేడాతోనే గెలిచారు. 2014లో విశాఖ ఉత్తరంలో బీజేపీ తరుఫున విష్ణు కుమార్ రాజు గెలిచారు. నాలుగేళ్లుగా టీడీపీ ఉనికి లేదు. కార్యకర్తలు లేరు. అలాంటి చోట గంటా రంగప్రవేశం చేసి అతి తక్కువ సమయంలో సమన్వయం చేసి  విజయబావుటా ఎగురవేయడం విశేషం. మొత్తానికి తక్కువ మెజార్టీ అయినా గంటా గెలవడం సంచలనంగా మారింది.


Tags:    

Similar News