హ‌రీశ్ శాఖా మార్పులో మ‌త‌ల‌బు ఇదేన‌ట‌?

Update: 2016-04-27 04:35 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన మంత్రివ‌ర్గ మార్పు చేర్పులు చ‌ర్చోప‌చ‌ర్చల‌ను కొన‌సాగిస్తోంది. నీటిపారుద‌ల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇప్పటి దాకా చూస్తున్న భూగ‌ర్భ‌ శాఖలను ఆయ‌న్నుంచి తప్పించి త‌న త‌న‌యుడు కేటీఆర్ కు అప్పగించడం వెనక మతలబేంటి? మీడియాలో మొదట ప్రచారం జరిగినట్లుగా హరీష్ రావే స్వయంగా కోరుకున్నారా..? అసలేం జరిగింది? అంటే రాజ‌కీయ‌వ‌ర్గాలు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇస్తున్నాయి.

నిజానికి మైనింగ్ శాఖను తప్పిస్తారన్న విషయం హరీష్ కు చివరి వరకూ తెలియ‌దని ఆయ‌న సన్నిహిత వర్గాలు ప‌లువురితో వ్యాఖ్యానించాయ‌ట‌. సోమ‌వారం మధ్యాహ్నం వరకూ దీనిపై ఆయనకు సమాచారం లేదని అయితే విషయం కాస్తా సీఎం పేషీ నుంచి లీక్ కావడంతో.. హరీష్ కాస్త షాకవ్వాల్సి వచ్చిందంటున్నారు. చివరకు హరీషే తనకు పని భారం ఎక్కువవుతున్నందున మైనింగ్ శాఖను వేరే వారికి అప్పగించాల్సిందిగా తానే సీఎం ను కోరానని  ఓ మెసేజ్ ను మీడియాకు లీక్ చేసుకోవాల్సి వ‌చ్చిందని రాజ‌కీయ‌వ‌ర్గాలు చెప్తున్నాయి.  అయితే త‌న నుంచి తొల‌గించిన శాఖలను కేటీఆర్‌ కు అప్పగిస్తారని హ‌రీశ్‌ రావు కూడా ఊహించి ఉండకపోవచ్చంటున్నారు. ఎందుకంటే కేటీఆర్ ఇప్పటికే అత్యంత కీలకమైన ఐటి - మున్సిపల్ - పరిశ్రమలు - ఎన్ ఆర్ ఐ వ్యవహారాలు - వాణిజ్య శాఖలను చూస్తున్నారు. ఇప్పుడు అదనంగా మైనింగ్ - జియాలజీ ఇచ్చారు. ఇన్ని శాఖలు చూడడం కేటీఆర్ కు భారం కానప్పుడు, హరీష్ కు మాత్రం ఎలా భారమవుతుంది?.. అన్న ప్రశ్న విశ్లేష‌కుల్లో ఉదయిస్తుంది.

టీఆర్ ఎస్‌ లో హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ రాజకీయం పాత కథేన‌ని ఈ సంద‌ర్భంగా విశ్లేష‌కులు ప్ర‌స్తావిస్తున్నారు. చాలా జాగ్రత్తగా హరీష్ రావును హ్యాండిల్‌ చేస్తూనే కుమారుడికి పగ్గాలు అందించే పనిలో కేసీఆర్ ఉన్నారని రాజకీయ‌వ‌ర్గాలు అంటున్నాయి. ఒక విశ్లేషణ ప్రకారం.. ప్రధానంగా రెండు గ్రూపులు అనధికారికంగా ఏర్పడ్డాయని పొలిటిక‌ల్ స‌ర్కిల్‌ లో టాక్ న‌డుస్తోంది. ఒకటి బంగారు తెలంగాణా వర్గం కాగా రెండోది ఉద్యమ తెలంగాణా వర్గం అని చెప్తున్నారు. బంగారు తెలంగాణా వర్గంలో కేటీఆర్ ప్రధాన పాత్రధారి అయితే ఉద్యమ తెలంగాణాలో హరీష్ ఉన్నారు. బంగారు తెలంగాణా వర్గాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేసీఆర్ కీలక చర్యలు తీసుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.

ఆ క్రమంలో హరీష్ రావుకు ఆర్థిక చేయూత నిచ్చే మార్గాలన్నింటినీ మూసేస్తున్నార‌ని, శాఖల బదలాయింపు కూడా అందులో భాగమేనని టాక్ న‌డుస్తోంది. అంతేకాక, హరీష్ రావుకు కాస్త సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు - జిల్లా స్థాయి నేతలపై కేసీఆర్ నిఘా ఉందని పెద్ద ఎత్తున చ‌ర్చ ఉంది. ఈ విషయం తెలిసేట‌ట్లుగా చేసి వారు హరీష్ రావును దూరం పెట్టేలాగా కథ నడుపుతున్నట్లుగా చెప్తున్నారు. సీఎం కేసీఆర్‌ ను ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు గనక, హరీష్ రావు అంటే అభిమానం ఉన్నా దాన్ని ఆ నేతలు బయటకు వ్యక్తం  చేయక‌పోవ‌డం ఇందులో భాగ‌మేన‌ని అంటున్నారు. మొత్తంగా శాఖల మార్పు హ‌ఠాత్ నిర్ణ‌యం కాద‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోందని తేల్చేస్తున్నారు.
Tags:    

Similar News