విశాఖలో కాబినెట్ మీటింగ్.. అందుకేనా?

Update: 2019-12-24 06:59 GMT
ఏపీలో మూడు రాజధానుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఏపీ రాజధానుల మీద ఏపీ ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ ఇప్పటికే తన ప్రతిపాదనలకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి చేతికి ఇవ్వటం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ నెల 27న విశాఖపట్నంలో ఏపీ కాబినెట్ సమావేశాన్నినిర్వహించనున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే అధికారులకు అందాయంటున్నారు. విశాఖలో నిర్వహించే తాజా మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నారని చెబుతున్నారు.

పాలనా రాజధానిగా విశాఖను ఏర్పాటు చేయాలన్న జగన్ మాటకు తగ్గట్లే.. ఈ నెల 27న కాబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. విశాఖలో నిర్వహించే మంత్రివర్గ సమావేశంలోనే జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించటంతో పాటు.. కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. తాజా సమావేశంలో విశాఖ పాలనా రాజధాని అన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు అవుతుందంటున్నారు.

అంతేకాదు.. రాజధాని తరలింపునకు సంబంధించిన అంశాల్ని తాజా కాబినెట్ మీటింగ్ లో విపులంగా చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సంక్రాంతి పండుగ తర్వాత రాజధాని తరలింపు కార్యక్రమం షురూ అవుతుందని చెబుతున్నారు. పాలనా రాజధానిగా విశాఖగా ప్రకటించటానికి ముందే.. విశాఖలో ఏర్పాటు చేసే కార్యాలయాలకు అనువైన భవనాల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు సాగుతున్నట్లు సమాచారం.

విశాఖకు రాజధానిని తరలించే క్రమంలో ఎదరయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు వీలుగా ఇప్పటికే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను సిద్ధం చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. తొలుత సచివాలయ ముఖ్య అధికారులతో చర్చలు జరపటం.. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల నిరసనలకు చెక్ పెట్టే ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. భూములు ఇచ్చే వారికి ఎలాంటి నష్టం వాటిల్లదన్న అభయం ఇవ్వటమే కాదు.. భూముల విలువను పెంచేందుకు అవసరమైన చర్యలకు సంబంధించిన అంశాల్ని కూడా ప్రకటించే వీలుందన్న మాట వినిపిస్తోంది.



Tags:    

Similar News