ఓట‌మి భ‌యంతోనే మోడీ ముంద‌స్తుకు పోవ‌ట్లేదా?

Update: 2018-04-01 04:26 GMT
కొద్దికాలం క్రితం వ‌ర‌కు ముంద‌స్తు ఎన్నిక‌ల జ‌పం వినిపించిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ టీం ఇప్పుడు అద స్థాయిలో ఎందుకు ఆ ఎత్తుగ‌డ ప్ర‌స్తావించ‌డం లేదనే కొంద‌రి సందేహానికి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం వ‌స్తోంది. లోక్‌ సభ - రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరుపాలన్న అంశంపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంద‌ని, అయితే ఈ విషయమై అధికార ఎన్డీయే కూటమికి సారథ్యం వహిస్తున్న బీజేపీకి 2004లో ఒక చేదు అనుభవం ఉన్న నేప‌థ్యంలో అది క్రియాశీలంగా లేదంటున్నారు. అప్పటి ప్రధాని వాజ్‌ పేయి ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమి పాలైన నేపథ్యంలో బీజేపీ మళ్లీ ఒక దేశం ఒక ఎన్నిక పేరిట ఏకకాలంలో లోక్‌ సభ - అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సాహసం చేస్తుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. 2014లో నరేంద్రమోడీ సారథ్యంలో పూర్తిస్థాయి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ మరోదఫా ముందస్తు జమిలి ఎన్నికలపై చర్చను లేవనెత్తింది. ఈ నేపథ్యంలో పలు అంశాలు ముందుకొస్తున్నాయి..

-ఉమ్మడి ఎన్నికల వాదన ముందుకు తెచ్చిన అధికార పక్షం తన వ్యూహం ఏమిటో బయటపెట్టకపోవడం విపక్షాలను ఆందోళనకు గురి చేస్తోంది. అవిశ్రాంతంగా - దూకుడుగా ప్రచారం చేయగల సామర్థ్యం ఉన్న ప్రధాని మోడీ చేసే నిరంతర విమర్శల దాడిని ఎదుర్కోవడం కష్టమేనని అవి భావిస్తున్నాయి. ఏకకాలంలో ఎన్నికలతో బీజేపీకే లబ్ధి చేకూరుతుందని విశ్వసిస్తున్నాయి. కనుక ప్రధాని మోదీ ప్రతిపాదనకు విపక్షాలు ఆమోద ముద్ర వేసే పరిస్థితులు కనిపించడం లేదు.

-లోక్‌ సభ - వివిధ రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు తప్పనిసరి.

-ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగితే లోక్‌ సభ ఎన్నికలు 2019 ఏప్రిల్‌ - మే నెలల్లో జరుగుతాయి. లోక్‌ సభతోపాటు అరుణాచల్ ప్రదేశ్ - ఒడిశా - తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ ఏడాది చివరిలో గానీ - 2019 ప్రారంభంలో గానీ మిజోరం - మధ్యప్రదేశ్ - ఛత్తీస్‌ గఢ్ - రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగాల్సి ఉంది. లోక్‌ సభతోపాటు ఈ నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరుపాలంటే ఆ రాష్ర్టాల్లో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి పాలన విధించిన ఆరు నెలల్లోపే పార్లమెంట్ ఆమోదం పొందాలంటే ప్రధాన పార్టీల మధ్య ఉమ్మడి అవగాహన - ఏకాభిప్రాయం కావాలి.

-మహారాష్ట్ర - హర్యానా - జార్ఖండ్‌ తోపాటు కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరుపాలని నిర్ణయిస్తే లోక్‌ సభతోపాటే ఒకేసారి 10 రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. ఢిల్లీ మినహా మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ప్రజాతీర్పును కోరే అవకాశం ఉంది.

-రాజస్థాన్ మినహా మధ్యప్రదేశ్ - ఛత్తీస్‌ గఢ్ రాష్ర్టాల్లో 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. దీంతో ఆ రాష్ర్టాల్లో బీజేపీ కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. లోక్‌ సభ కన్నా ముందే ఈ రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే విజయం సాధించగలమని కాంగ్రెస్ పార్టీ ఆశాభావంతో ఉన్నా.. మోదీ వ్యూహం ఫలిస్తే గుజరాత్ ఫలితాలే పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.

--లోక్‌ సభ - అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరిగినా - జరుగకున్నా వాటి ఫలితం ప్రధాని మోడీ - ఎన్డీయే ప్రభుత్వ పనితీరుకు రిఫరెండమని బీజేపీ నేతలు అంటున్నారు. దేశాధ్యక్ష ఎన్నికల తరహాలో ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రధాని మోడీ హవాతో తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రజా వ్యతిరేకతను అధిగమించవచ్చని కమలనాథుల వ్యూహం. వేర్వేరు ఎన్నికల నిర్వహణతో స్థానిక నేతల ఆకాంక్షలు, అసంతృప్తులు బయటపడతాయన్న సందేహాలు ఆ పార్టీలో ఉన్నాయి.

-ఈ ఏడాది డిసెంబర్ నుంచి 13 నెలల్లోపు ఎన్నికలు జరిగాల్సిన రాష్ర్టాల్లో బీజేపీ పాలిత రాష్ర్టాలే ఎక్కువ.

-జమిలి ఎన్నికలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తరచూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆంక్షలు అమలులో ఉండటం వల్ల సంక్షేమ పథకాల అమలు సాఫీగా సాగదు. జమిలి ఎన్నికలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. వనరులను పొదుపు చేయొచ్చు. ప్రభుత్వ ఖజానాపై అదనం భారాన్ని తగ్గించవచ్చు. సుపరిపాలనకు వీలు కలుగుతుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ గత అనుభావాల కారణంగా అధికార బీజేపీ ముందస్తు జమిలి ఎన్నికలకు వెళ్లకపోవచ్చునని విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News