అమ్మ అడ్డాలో పోలింగ్ పూర్తి..

Update: 2017-12-22 03:49 GMT
ప‌లు వివాదాలు.. ఆరోప‌ణ‌లు.. నాట‌కీయ మ‌లుపులు తిరిగిన ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక ఎట్ట‌కేల‌కు పోలింగ్ ప్ర‌శాంతంగా పూర్తైంది. అమ్మ మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆమె ప్రాతినిధ్యం వ‌హించిన ఆర్కే న‌గ‌ర్ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక పోలింగ్‌ లో ఓట‌ర్లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. గురువారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు సాగిన పోలింగ్ లో మొత్తం 73.45శాతం ఓటింగ్ న‌మోదైంది. మొత్తం 258 పోలింగ్ స్టేష‌న్ల‌లో ఈ ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించారు. సాయంత్రం 5 గంట‌లకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ప్ర‌తిఒక్క‌రికి ఓటు వేసే అవ‌కాశాన్ని ఇచ్చారు.

ఈ పోలింగ్ ఫ‌లితాలు డిసెంబ‌రు 24 (ఆదివారం) వెలువ‌డ‌నుంది. ఏదైనా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జాప్ర‌తినిధి మ‌ర‌ణిస్తే.. ఆర్నెల్ల లోపు ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించాల్సి ఉంది. అయితే.. ఈ ఏడాది ఏప్రిల్ లో ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ జారీ చేశారు.ఉప ఎన్నిక ప్ర‌చారం సంద‌ర్భంగా  పెద్ద ఎత్తున అక్ర‌మాలు చోటు చేసుకోవ‌టంతో ఎన్నిక‌ను వాయిదా వేశారు. తాజాగా మ‌రోసారి ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించారు.

ఈ కార‌ణంగా ఏడాదికి పైనే ఆర్కే న‌గ‌ర్ స్థానం ఖాళీగా ఉంది. తాజా ఉప ఎన్నిక త్రిముఖ పోటీ న‌డిచింది. అధికార అన్నాడీఎంకే.. శ‌శిక‌ళ వ‌ర్గం.. డీఎంకే.. బీజేపీ అభ్య‌ర్థుల‌తో పాటు మొత్తం 59 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు.  ఉప ఎన్నిక సంద‌ర్భంగా భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంద‌ని.. ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు అన్ని పార్టీ అభ్య‌ర్థులు పెద్ద ఎత్తున డ‌బ్బు ఖ‌ర్చు చేశార‌న్న ఆరోప‌ణ ఉంది.

అధికార అన్నాడీఎంకే చీలిక వ‌ర్గం చిన్న‌మ్మ పార్టీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన దిన‌క‌ర‌న్  పెద్ద ఎత్తున ఓట‌ర్ల‌కు ఎర వేశార‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఒక్కో ఇంటికి రూ.50 వేల నుంచి రు.75 వేల వ‌ర‌కూ (ఐదు ఓట్లు ఉన్న ఇంటికి) ముట్ట‌జెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. అధికార అన్నాడీఎంకే (ప‌ళ‌ని.. ప‌న్నీరు) సైతం ఓటుకు రూ.6వేల వ‌ర‌కు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక‌.. విప‌క్ష డీఎంకే ఒక్కో ఓటుకు గ‌రిష్ఠంగా రూ.4వేలు ఇచ్చారంటున్నారు.

ఏది ఏమైనా ఈ ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని మూడు పార్టీల అభ్య‌ర్థులు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ ఎన్నిక ఫ‌లితం భ‌విష్య‌త్ త‌మిళ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేస్తుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌మ‌దే అస‌లైన అన్నాడీఎంకే అని ప్ర‌చారం చేసుకుంటున్న ప‌ళ‌ని.. ప‌న్నీరుకు ప్ర‌జామోదం ఉంద‌న్న విష‌యం తాజా గెలుపుతోనే సాధ్య‌మ‌ని భావిస్తుండ‌గా.. ఈ ఎన్నిక‌ల్లో గెల‌వ‌టం ద్వారా త‌న ప‌ట్టు పోలేద‌ని.. అమ్మ‌కు అస‌లుసిస‌లు వార‌సులు తామేన‌ని శ‌శిక‌ళ వ‌ర్గం భావిస్తోంది. ఉప ఎన్నిక‌ల్లో గెలిస్తే.. ప‌ళ‌ని.. ప‌న్నీరు ప్ర‌భుత్వానికి కౌంట్ డౌన్ మొద‌లెట్టొచ్చ‌న్న ఆలోచ‌న‌లో ఉంది. ఇక‌.. విప‌క్ష డీఎంకే ఆలోచ‌న‌లు వేరుగా ఉన్నాయి. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత అధికార‌ప‌క్షంలో చోటు చేసుకున్న అంత‌ర్గ‌త విభేదాలు.. రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని.. ప్ర‌త్యామ్నాయంగా త‌మ‌నే చూస్తున్నార‌న్న విష‌యాన్ని ఎన్నిక‌ల్లో విజ‌యం ద్వారా చెప్పాల‌ని భావిస్తోంది. మ‌రి.. తుది తీర్పు ఎలా ఉంద‌న్న విష‌యం ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. అప్ప‌టివ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News