రేవంత్‌ తో డీల్ కోసం ట్రై చేసిన మంత్రి ఎవ‌రంటే?

Update: 2018-01-06 16:56 GMT
మంత్రి లక్ష్మారెడ్డిపై మ‌రోమారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. వైద్య పట్టా విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయని పేర్కొంటూ మంత్రి ల‌క్ష్మారెడ్డి తాజాగా ఇప్పించిన వివ‌ర‌ణ ద్వార అనేక సందేహాలు క‌మ్ముకున్నాయ‌న్నారు. గాంధీభ‌వ‌న్‌ లో శ‌నివారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాలేజీ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ ఓసీ ఇస్తుందని...ఆ తర్వాత యూనివర్సిటీ అంగీకారం ఇస్తే...త‌దుప‌రి తరువాత సెంట్రల్ కౌన్సిల్ అనుమతి ఇస్తుందని రేవంత్ రెడ్డి వివ‌రించారు. 1980-81లో ల‌క్ష్మారెడ్డి చేరితే ఆ కాలేజీకి  1985 వరకు సీసీహెచ్‌ అనుమతి లభించలేదని అలాంటప్పుడు మంత్రి చదువు చెల్లుతుందా అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

`మెరిట్ విద్యార్థి అని చెప్తున్న‌ లక్ష్మారెడ్డి 1988లో పాస్ అయినట్టు 2004 అఫిడవిట్ లో చెప్పారు. అది కూడా గుల్బర్గా యూనివర్సిటీ అన్నారు.

2014 అఫిడవిట్ లో 87 లో హైదరాబాద్ కర్ణాటక యూనివర్సిటీ నుండి పాస్ అయినట్లు అఫిడవిట్ లో ఆయనే చెప్పారు. ఇంత‌కీ మంత్రి గారు .. చదివింది గుల్బర్గా యూనివర్సిటీనా - లేక హైదరాబాద్-కర్ణాటక యూనివర్సిటీనా? ` అని రేవంత్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. `ఒక‌వేళ‌ గుల్బర్గా యూనివర్సిటీకి 1990లో అనుమతి వస్తే.. 1988లో ఆయనకు ఏ యుగ పురుషుడు సర్టిఫికేట్ ఇచ్చారో చెప్పాలి?` అని రేవంత్ ఎద్దేవా చేశారు.

`మంత్రి ల‌క్ష్మారెడ్డి త‌న‌ సొంత ఊరు ఆవంచలో ప్రాక్టీస్ పెట్టారు కదా.. తెలంగాణ బోర్డ్ ఆ హోమియోపతి లో మీరు నమోదు చేసుకున్న పత్రం చూపించండి. ప్రిన్సిపాల్ సంపత్ రావు ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మారెడ్డి గారి పట్టా గురించి చెప్పారే త‌ప్ప‌...వివరాలు చెప్పలేదు. ప్రిన్సిపాల్  సంపత్ రావు - లక్ష్మారెడ్డి క్లాస్ మేట్స్. ఇప్పుడు సంపత్ రావు పట్టా క‌థ ఏందో కూడా చెప్పాలి!` అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. `2015లో ఆర్టీఐ కింద వివ‌రాలు అడిగితే ..30  సార్లు తిప్పి ఇప్పటిదాకా వివరాలు కళాశాల వారు ఇవ్వ‌లేదు. ల‌క్ష్మారెడ్డి మీరు ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించినందుకు .. మీరు శిక్షకు అర్హులు కారా? ` అని రేవంత్ స‌వాల్ విసిరారు. `మీరు అసమర్థ మంత్రి అని ఆనాడు అన్నాము..ఈనాడు అన్నాము.. నిరూపించుకోవాలి. లక్ష్మారెడ్డి గారి చ‌దువు ఎక్కువలో ఎక్కువ ఆర్ ఎంపీ.  అందుకే మున్నాభాయ్ ఆర్ ఎంపీ అన్నాను.` అంటూ త‌న కామెంట్ల‌పై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

కాగా, మంత్రి ల‌క్ష్మారెడ్డి త‌నతో డీల్ కుదుర్చుకునేందుకు ప్ర‌య‌త్నించార‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. `నా దగ్గరికి.ఒక మిత్రుడిని మంత్రి ల‌క్ష్మారెడ్డి పంపాడు. సీఎం త‌న‌యుడైన మంత్రి కేటీఆర్ ఒత్తిడి వల్లనే మాట్లాడాను..ఇక వాదోప‌వాదాలు ఆపేద్దాం అని చెప్పారు` అని రేవంత్ సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. `మిడ్జిల్ లో లక్ష్మారెడ్డి నా పరోక్షంలో నన్ను, నా కుటుంబ సభ్యులను విమ‌ర్శించారు. నా పట్ల - నా కుటుంబ సభ్యులను చెప్పారని భాషలో తిట్టిస్తున్నారు. అభిమానుల పేరిట అనిపిస్తున్నారు. నా అభిమానులను పంపి అదే రీతిలో డీల్ సెట్ చేసుకోవాలా? కానీ నా అభిమానులకు మీ మాటలు చేరితే.. మీరన్న మాటలను చేసి చూపిస్తారు` అంటూ రేవంత్ విస్ప‌ష్ట కామెంట్లు చేశారు. ` మంత్రులు కేటీఆర్ - లక్ష్మారెడ్డి గారు నన్ను మానసికంగా ఒత్తిడి  చేస్తుండొచ్చు.. మీకు మీ బ‌ల‌గం ఉండొచ్చు.. కానీ.. నాకు కూడా నా సామాజిక వర్గం ఉంది. కేటీఆర్ మామ మీద, లక్ష్మారెడ్డి సర్టిఫికెట్ మీద చర్చకు నేను సిద్ధం. మీరు సిద్ధ‌మేనా? ` అంటూ స‌వాల్ విసిరారు.
Tags:    

Similar News