రేవంత్‌... సీనియ‌ర్ల‌ను లైన్‌లో పెడుతున్నారే!

Update: 2017-11-05 11:21 GMT
తెలుగు దేశం పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి అప్పుడే త‌న ప‌ని మొద‌లు పెట్టేశారు! అయితే పెద్ద‌ల ఆశీర్వాదాలు ఉంటే కాంగ్రెస్‌లో తిరుగుండ‌ద‌నే విష‌యం జ‌గ‌మెరిగిన స‌త్య‌మే! అందుకే ముందుగా వారిని మ‌చ్చిక చేసుకునే ప‌నిలో ప‌డ్డారు రేవంత్‌! అందుకే వ‌రుస‌గా సీనియ‌ర్ల‌ను క‌లిసే ప‌డ్డారు! తాను పార్టీలోకి ఎందుకు వ‌చ్చింది, తాను ఎలా మసులుకునేది వంటి అంశాల‌ను వివ‌రిస్తున్నార‌ట‌. దీని వెనుక మ‌రో వ్యూహం కూడా లేక‌పోలేదని తెలుస్తోంది! కాంగ్రెస్‌లో చేర‌గానే ఆయ‌న కు కీల‌క ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని అంతా భావించారు. అయితే అందుకు ఇంకా స‌మ‌యం ఉండ‌టంతో.. ఈలోగా సీనియ ర్ల‌తో  స‌త్సంబంధాలు కొన‌సాగించే వ్యూహానికి రేవంత్ తెర‌తీశార‌ట‌!!

రేవంత్ రెడ్డి చేరికను కాంగ్రెస్‌లో చాలామంది కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇక ఆయ‌న‌కు పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తార‌ని ఆయ‌న వ‌ర్గీయుల‌తో పాటు కాంగ్రెస్ నేత‌లందరూ భావించారు! అయితే ఓటుకు నోటు కేసులో ఉండటం, వచ్చీ రాగానే ఆయనకు పదవి ఇవ్వడం ఏమిటని కొందరు సీనియ‌ర్లు వాపోతున్నారు. ఈ నేప‌థ్యంలో పదవి అంశాన్ని కొన్నాళ్లు పక్కన పెట్టాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. సీనియర్లతో మాట్లాడి అందరినీ కూల్ చేసిన‌ తర్వాత ఆయనకు పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇది తెలిసిన రేవంత్‌.. వరుస‌గా పలువురు నేతలతో భేటీ అవుతున్నారు.

ఇటీవల డీకే అరుణతో మాట్లాడారు. ఉప్పు-నిప్పులా వ్య‌వ‌హ‌రించే వీరు క‌ల‌వ‌డం అంద‌రికీ ఉత్కంఠ క‌లిగించింది. త‌ర్వాత రేవంత్ రెడ్డి తనతో పాటు వేం నరేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని హైదరాబాదులో కలిశారు. ఎందుకు పార్టీలోకి వ‌చ్చిందో వివ‌రించారు. ఇక పార్టీలో తాను మసలుకునే విధానం వారికి చెప్పారని సమాచారం. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెబుతున్నారట. అయితే కాంగ్రెస్ సీనియ‌ర్లు రేవంత్‌పై ప్ర‌శంస‌లు కూడా కురిపించేస్తున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతా రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ ప్రజలను ఆకట్టుకొనే వ్యక్తి అన్నారు. ఆయన రాకతో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాకపోవచ్చని గీతా రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, రేవంత్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ఇది తెలంగాణ స్పీకర్‌కు చేరాల్సి ఉంది. మరి దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే!!
Tags:    

Similar News