14 నుంచి 4కి పడిపోయిన రేవంత్ గ్రాఫ్

Update: 2018-11-13 10:23 GMT
టీకాంగ్రెస్‌ లో ముందు నుంచి ఉన్న చెవుల కంటే వాడిగా కనిపించిన రేవంత్ రెడ్డి కొమ్ముల పదును ఏమాత్రం పనిచేసినట్లు కనిపించడం లేదు. తన వర్గానికి 14 సీట్లు ఇప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన రేవంత్‌ కు ప్రస్తుతానికి నాలుగు టిక్కెట్లే దక్కాయి. కాంగ్రెస్ తొలి జాబితాలో ఆయన వర్గంలో ఆయన - మరో ముగ్గురికి మాత్రమే టిక్కెట్లు వచ్చాయి.
   
భారీ సంఖ్యలో టీడీపీ నేతలతో కాంగ్రెస్‌ లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో కనీసం తన వర్గానికి 14 సీట్లు కేటాయించాలని మొదటి నుంచి పట్టుపడుతున్నారు. అంతేకాదు... తన వారందరికీ టికెట్లు రాకుంటే పార్టీని వీడుతారన్న ప్రచారమూ జరిగింది. కానీ కాంగ్రెస్‌ ప్రకటించిన తొలి జాబితాలో రేవంత్ రెడ్డి వర్గానికి నాలుగు సీట్లు మాత్రమే దక్కాయి. కొడంగల్‌ నుంచి రేవంత్‌ రెడ్డికి టికెట్ కేటాయించగా ములుగు టికెట్ సీతక్కకు - చొప్పదండి టికెట్‌ మేడిపల్లి సత్యంకు - పెద్దపల్లి టికెట్ విజయ రమణారావుకు ఇచ్చారు.
   
ఆయన వర్గం వారు అడుగుతున్న సీట్లలో ఇతరులకు టిక్కెట్లిచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్టేషన్ ఘనపూర్‌ టికెట్‌ ను దొమ్మాటిసాంబయ్యకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ ఇందిరకు టికెట్ కేటాయించారు. సూర్యాపేట టికెట్‌ ను తనతో పాటు కాంగ్రెస్‌లో చేరిన పటేల్ రమేష్‌ రెడ్డికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి పట్టుబట్టారు. కానీ సూర్యాపేట టికెట్ మాజీ మంత్రి ఆర్‌. దామోదర్‌ రెడ్డికే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అరికెల నర్సారెడ్డికి కూడా నిజామాబాద్ అర్బన్ టికెట్ ఇప్పించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించారు.. పార్టీ దాన్ని పెండింగులో ఉంచింది. దీంతో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో తాను అనుకున్నది సాధించుకోలేకపోయారంటున్నారు ఆయన ప్రత్యర్థులు.


Tags:    

Similar News