మ‌రో దీక్ష‌కు రేవంత్ రెడీ

Update: 2016-09-16 10:29 GMT
తెలంగాణ టీడీపీలో స్టైలిష్ నేత‌గా ఎదిగిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. తాజాగా మ‌రో సారి సీఎం కేసీఆర్‌ పై పోరుకు రెడీ అయ్యారు. టీఆర్ ఎస్ అన్నా.. సీఎం కేసీఆర్ అన్నా.. సింగిల్ లెగ్‌ పై విరుచుకుప‌డే రేవంత్ ఇటీవ‌ల కాలంలో మ‌రింత రెచ్చిపోతున్నారు. మొన్నామ‌ధ్య మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజ‌క్టు నిర్వాసితుల‌కు మ‌ద్ద‌తుగా పెద్ద ఎత్తున బ‌హిరంగ స‌భ చేప‌ట్టి.. అనంత‌రం  ఏటిగ‌డ్డ కిష్టాపూర్‌ లో నిరాహార దీక్ష‌కు కూర్చున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపై త‌వ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌జ‌ల ప‌క్షాన త‌న పోరు కొన‌సాగుతుంద‌ని అన్నారు. కేసీఆర్‌పై పంచ్‌ ల మీద పంచ్‌ ల‌తో విరుచుకుప‌డే ఈ యువ నేత నేను నిద్ర‌పోను - నిన్ను నిద్ర‌పోనివ్వ‌ను అన్న‌ట్టుగా సీఎం కేసీఆర్‌ కు కంట్లో న‌లుసులా మారాడ‌ని అంటున్నారు టీఆర్ ఎస్ నేతలు.

ఇక‌, తాజా విష‌యానికి వ‌స్తే.. రేవంత్‌ రెడ్డి మ‌రో దీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. సీఎం కేసీఆర్ స‌హా ఆయ‌న ప్ర‌భుత్వం అవలంబిస్తున్న భూసేక‌ర‌ణ విధానంపై రేవంత్ ఓ రేంజ్‌ లో ఫైరైపోతున్నారు. కేసీఆర్ వైఖ‌రితో రైతుల‌కు న‌ష్టం వ‌స్తుంద‌ని, అదేస‌మ‌యంలో ఆయ‌న బంధువుల‌కు మేలు జ‌రుగుతోంద‌ని ఇటీవ‌ల అనేక సార్లు విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఈ నెల 19 - 20 తేదీల్లో త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ఆయ‌న రైతు దీక్షకు దిగ‌నున్నారు. భూసేక‌ర‌ణ‌తో పాటు మహారాష్ట్రతో ఇటీవ‌ల‌ తెలంగాణ ప్ర‌భుత్వం చేసుకున్న‌ నీటి ఒప్పందాలపై ఆయ‌న దీక్ష ద్వారా నిర‌స‌న తెలప‌నున్నారు.

 రాష్ట్రంలో ఏర్ప‌డిన‌ క‌ర‌వుతో పంట న‌ష్ట‌పోయిన రైతులకు ఎక‌రానికి రూ.15 వేలు చెల్లించాల‌ని ఆయ‌న డిమాండ్‌ చేస్తున్నారు. మ‌రి ఈ దీక్ష‌పై టీఆర్ ఎస్ నేత‌లు  ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా రేవంత్ దీక్ష‌కు గ‌తంలో మాదిరి గ్రేట్ రెస్పాన్స్ వ‌స్తుంద‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. ఇప్ప‌టికే దీక్ష‌కు సంబంధించిన ప‌నిలో యువ‌నేత మునిగిపోయారు. ఈ దీక్ష‌ను స‌క్సెస్ చేయ‌డం ద్వారా కేసీఆర్‌కు ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని రేవంత్ డిసైడ‌య్యార‌న్న‌మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News