కేసీఆర్ మీటింగ్‌కు వ‌స్తానంటున్న రేవంత్ భార్య‌!

Update: 2018-12-04 09:47 GMT
రేవంత్ రెడ్డి అరెస్టుతో కొడంగ‌ల్‌లో యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆయ‌న మ‌ద్ద‌తుదారులు ఎక్క‌డిక‌క్క‌డ ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు. ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా పోలీసులు భారీగా బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. కేంద్ర సాయుధ బ‌ల‌గాల సాయం కూడా తీసుకుంటున్నారు. కొడంగ‌ల్‌లో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ స‌భ కూడా మంగ‌ళ‌వారమే ఉండ‌టంతో ఉద్రిక్త‌త‌లు రెట్టింప‌వుతున్నాయి. కేసీఆర్ స‌భ నేప‌థ్యంలో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు - కాంగ్రెస్ అభిమానుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకునే అవ‌కాశ‌ముందని ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా భ‌ర్త అరెస్టుతో తీవ్ర వేద‌న‌కు గురైన రేవంత్ రెడ్డి భార్య గీత సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కొడంగ‌ల్‌లో ఈ రోజు జ‌రిగే కేసీఆర్ ప్ర‌చార స‌భ‌కు తాను హాజ‌రవ్వాల‌నుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేసీఆర్ స‌భ జ‌రిగ‌నున్న ప్రాంతానికి గీత మంగ‌ళ‌వారం ఉద‌య‌మే విచ్చేశారు. ఆమె వెంట వంద‌లాది మంది కాంగ్రెస్‌ కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. కొడంగ‌ల్‌లో ప్ర‌స్తుతం 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంద‌ని స‌భా ప్రాంగ‌ణంలోని పోలీసుల‌కు గీత గుర్తుచేశారు. అలాంట‌ప్పుడు బ‌హిరంగ స‌భ ఎలా నిర్వ‌హిస్తారంటూ నిల‌దీశారు.

అంత‌టితో గీత ఊరుకోలేదు. తాను కూడా కేసీఆర్ స‌భ‌కు హాజ‌రు కావాల‌నుకుంటున్న‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. త‌న రాక‌కు అనుమ‌తి ఇవ్వాలంటూ పోలీసుల‌ను డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఎటూ చెప్ప‌లేక త‌ల ప‌ట్టుకుంటున్నారు. త‌న వెంట వ‌చ్చిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కేసీఆర్ స‌భ జ‌ర‌గ‌నున్న‌ ప్రాంగ‌ణంలో ఏర్పాట్ల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా వారిని గీత వారించారు. మ‌రోవైపు - కొడంగ‌ల్‌లో ఉద్రిక్త‌త‌ల‌పై అద‌న‌పు డీజీపీ జితేంద‌ర్ స్పందించారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ఎవ‌రు విఘాతం క‌ల్పించినా వారిని జైల‌కు త‌ర‌లిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News