నామినేషన్ ట్విస్ట్‌..విశాల్‌ పై చ‌ర్య‌ల‌కు ఈసీ రెడీ

Update: 2017-12-09 09:39 GMT
తమిళనాడులోని ఆర్‌.కె నగర్‌ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రధానంగా అన్నాడీఎంకే - డీఎంకే - శశివర్గం అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే ఇలా ప్ర‌ధాన పార్టీలు - వ‌ర్గాల్లో సంద‌డి నెల‌కొంటుండ‌గా....మ‌రోవైపు న‌టుడు విశాల్ ఎపిసోడ్ మ‌లుపులు తిరిగింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు విశాల్‌ ను బ‌ల‌ప‌రుస్తూ సంతకం చేసిన దీప‌న్ - సుమ‌తి మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. అస‌లు తాము సంతకాలు చేయ‌నేలేద‌ని పేర్కొంటూ త‌మ సంత‌కాల‌ను ఫోర్జ‌రీ చేశార‌ని ఆరోపించారు. ఈ వార్త తెర‌మీద‌కు రావ‌డం త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది.

ఈ ఇద్ద‌రి సంత‌కాల విష‌యంలో త‌లెత్తిన స‌మ‌స్య  కార‌ణంగానే విశాల్ నామినేష‌న్ తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఒక‌ట్రెండు రోజుల పాటు తెర‌మీద‌కు రాని సుమ‌తి, దీప‌న్ తాజాగా ఈసీకి ఇచ్చిన వివ‌ర‌ణ‌లో త‌మ సంత‌కం ఫోర్జ‌రీ అయింద‌ని పేర్కొన‌డంతో...ఈ వీడియో సాక్ష్యాన్ని ఈసీ ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంది. విశాల్ వారి సంత‌కాల‌ను ఫోర్జ‌రీ చేసినట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌న్న ఈసీ అధికారులు...ఎవ‌రైనా ఫిర్యాదు చేస్తే...త‌గు చర్య‌లు తీసుకుంటామ‌న్నారు. దీంతో విశాల్‌ పై కేసు న‌మోద‌వుతుందా అనే చ‌ర్చ సాగుతోంది.

మ‌రోవైపు ఈ ఉప ఎన్నిక‌ల‌పై విశాల్ స్పందించారు. ఆర్‌ కే నగర్‌ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని నామినేషన్ వేశానే త‌ప్ప‌..త‌న వెనుక ఎవ‌రూ లేర‌ని విశాల్ స్ప‌ష్టం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నానని ప్రకటించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. రాజకీయాల కార‌ణంగా త‌మ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురైంద‌ని చెప్పిన విశాల్‌..ఈ విష‌యంలో త‌న‌కు స‌హ‌క‌రించిన వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న రాజ‌కీయ ఎంట్రీపై త్వ‌ర‌లో నిర్ణ‌యం ఉంటుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. త‌నకు ఉప ఎన్నిక కంటే...ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ప్ర‌ధాన‌మ‌న్నారు. తుఫాను కార‌ణంగా అత‌లాకుత‌ల‌మైన జాల‌ర్లకోసం సంక్షేమం త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని కోరారు. రెండురోజులుగా జాల‌ర్లు ఆందోళ‌న చేస్తున్న‌ప్ప‌టికీ... ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డం స‌రికాదని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఇదిలాఉండ‌గా...అమ్మ వారసులం తామేనంటూ ఆయన గల్లీ గల్లీలో ఇటు అన్నాడీఎంకే పార్టీ నేత‌లు - అటు అమ్మ‌వ‌ర్గం ప్ర‌చారం చేపట్టారు. ఈ నెల 21 న ఆర్.కె నగర్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనున్న నేప‌థ్యంలో ఆర్కే న‌గ‌ర్ ప‌రిధిలో పెద్ద ఎత్తునే హ‌డావుడి నెల‌కొంది.
Tags:    

Similar News