రోజాపై మరోసారి ఏడాది సస్పెన్షన్ వేటు

Update: 2016-03-21 04:47 GMT
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుచితంగా వ్యవహరించిన దానికి ఇప్పటికే ఏడాది సస్పెన్షన్ వేటు పడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై మరోసారి చర్యకు గురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. విపక్ష సభ్యుల తీరుపై వచ్చిన ఫిర్యాదుపై ఏపీ శాసనసభా హక్కుల సంఘం ఇచ్చిన నివేదికపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సభా హక్కుల సంఘం ఇచ్చిన నివేదికను అమలు చేసిన పక్షంలో ఆర్కే రోజాపై ఏడాది సస్పెన్షన్ వేటు పడే వీలుందని తెలుస్తోంది. ఆమెతో పాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కూడా ఏడాది వేటు పడటం ఖాయమని చెబుతున్నారు. వీరిద్దరితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న విపక్ష నేతలు జ్యోతుల నెహ్రు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై మాత్రం ఎలాంటి చర్యలు ఉండవని చెబుతున్నారు.

అయితే.. రోజా వ్యవహారంలో విధించే సస్పెన్షన్ ఏ తేదీ నుంచి అమలు చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఆమెపై ఏడాది సస్పెన్షన్ వేటు ఉంది. దీనికి సంబంధించి హైకోర్టు నుంచి ఆమె స్టే తెచ్చుకోవటం.. దానిపై స్పీకర్ నిర్ణయం నేపథ్యంలో ఆమెను సభకు అనుమతించని సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా సభాహక్కుల సంఘం తీసుకునే చర్యల్లో భాగంగా విధించే ఏడాది సస్పెన్షన్ గత సస్పెన్షన్ తేదీ నుంచి అమలు చేస్తారా? లేక.. నిర్ణయం వెలువడుతున్న ఈ రోజు నుంచి అమలు ఉంటుందా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే విధించిన సస్పెన్షన్ పై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న ఆమె సభకు రావాలని ప్రయత్నిస్తున్న సందర్భంలోనే.. సభాహక్కుల సంఘం చర్యల్ని వెల్లడించటం ద్వారా రోజా సభలోకి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఇప్పట్లో రోజాను ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెట్టనిచ్చేందుకు ఏపీ అధికారపక్షం సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది.
Tags:    

Similar News