అమెరికాతో రూ. 22 వేల కోట్ల భారీ ఆయుధ ఒప్పందం !

Update: 2021-03-11 11:45 GMT
భారతదేశం రక్షణ రంగాన్ని కొద్ది కొద్దిగా పటిష్టం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే భారత్ అతి త్వరలో అగ్రరాజ్యమైన అమెరికా తో అత్యంత ఖరీదైన ఆయుధ ఒప్పందం చేసుకోనుంది. అమెరికా దేశం నుంచి సుమారు 3 బిలియన్‌ డాలర్లు, సుమారు రూ. 22 వేల కోట్లు, విలువైన అత్యాధునిక, శక్తిమంతమైన 30ఎంక్యూ-9బీ సైనిక డ్రోన్లను కొనుగోలు చేయనుంది. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. అయితే ఇప్పటికే శాండియాగోలోని జనరల్‌ ఆటమిక్స్‌ సంస్థతో ఒప్పందం ఖరారైనట్లు సమాచారం. అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ వచ్చేవారం భారత్‌ లో పర్యటించబోతున్నారు. ఆ సమయంలో ఈ భారీ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కో ఎంక్యూ-9బీ డ్రోన్‌.. 48 గంటలు గాలిలో ప్రయాణించగలదు. 1700 కేజీల పేలుడు పదార్థాలను మోసుకుపోగలదు.

ఇదిలా ఉంటే .. భారత వాయుసేనను బలోపేతం చేసేందుకు మొత్తం 59 కోట్లతో 36 ఎయిర్ క్రాఫ్ట్ ను అందించేలా ఫ్రాన్స్ తో భారతదేశం ఒప్పందం చేసుకుంది. రాఫెల్ యుద్ధవిమానాల రాకతో భారతదేశ వాయుసేన మరింత శక్తివంతం కావడం ఖాయం. భారత అమ్ములపొదిలో అధునాత రాఫెల్ విమానాలు ఇప్పటికే కొన్ని చేరాయి. గత ఏడాది జులైలో మొదటి విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్-10న ఈ ఐదు యుద్ధ విమానాలు అధికారికంగా వాయుసేనలో చేరాయి. మరోవైపు, ఇప్పటికే భారత్..అత్యధునిక యుద్ధ విమానాలు రాఫెల్స్‌ను కూడా రక్షణ కోసం సరిహద్దులోకి మోహరించింది. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్‌ ఏమాత్రం వక్రబుద్ధి చూపించినా.. తగిన బుద్ధి చెప్పేందుకు, వారి ఆట కట్టించేందుకు భారత ఆర్మీ, భారత వాయుసేన ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.

ఆత్యాధునిక 36 రాఫెల్స్‌ను రూ.59,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత్-‌ఫ్రాన్స్‌ మధ్య 2016లో ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. 2023 నాటికి ఐఏఎఫ్ ‌లో మొత్తం 36 రాఫెల్స్‌ చేరుతాయని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ ఆర్‌ కేఎస్ భదౌరియా ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో 18ని అంబాలా ఎయిర్ ‌బేస్ ‌లో, మరో 18ని భూటాన్ సరిహద్దులోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు.


Tags:    

Similar News