అది అమెజాన్ కంపెనీకాదు.. ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0

Update: 2021-09-27 10:09 GMT
బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ తాజాగా దేశంలోనే అతిపెద్ద ఈకామర్స్ కంపెనీ అమెజాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ వారపత్రిక 'పాంచజన్య' ఇటీవల ఇన్ఫోసిస్ పై ప్రచురించిన కథనం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ పై సంచలన కథనాన్ని ప్రచురించనుంది.  అమెజాన్ సంస్థను 'ఈస్ట్ ఇండియా కంపెనీగా' పోలుస్తూ పాంచజన్య టైటిల్ కవర్ ను ఆ పత్రిక ఎడిటర్ హితేశ్ శంకర్ ట్వీట్ చేశారు.

తాజాగా ఆర్ఎస్ఎస్ పత్రిక పాంచజన్య ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థపై వివాదాస్పద కవర్ స్టోరీతో ముందుకు వచ్చింది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కవర్ ఫొటోతో ఈ వివాదం చెలరేగింది. ఈ పిక్ ను పాంచజన్య ఎడిటర్ హితేశ్ శంకర్ ట్వీట్ చేశారు.

18వ శతాబ్ధంలో భారత్ పై గుత్తాధిపత్యం కోసం బ్రిటీష్ వారి ఈస్టిండియా కంపెనీ  ఏదైతే చేసిందో ఇప్పుడు అమెజాన్ సంస్థ కూడా అదే చేస్తున్నట్టు తెలుస్తోందని ఈ వ్యాసంలో ఆరోపించినట్టు తెలిసింది. భారత అధికారులకు అమెజాన్ న్యాయ ప్రతినిధులు లంచాలు ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలను ఉటంకిస్తూ ఆ సంస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెజాన్ భారీగా లంచాలు ఇచ్చి కప్పిపుచ్చుకునేంత పెద్ద తప్పు ఏం చేసిందని ఎడిటర్ ట్వీట్ చేసింది.  ఈ సంస్థ భారత అంకురాలకు ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు. భారత ఆర్థిక, సంస్కృతి స్వాతంత్ర్యం హరిస్తున్నదన్న ఆందోళనలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.

ఇటీవల అమెజాన్ సంస్థ 'లీగల్ ఫీజుల కింద రూ.8500 కోట్లు' చెల్లింపులపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.. ఆర్ఎస్ఎస్ ఆరోపణలపై అటు అమెజాన్ సంస్థ, ఇటు ప్రభుత్వం సీరియస్ గానే ఉన్నాయి. అమెజాన్ సంస్థ కూడా అంతర్గత దర్యాప్తునకు ఆదేశించింది. సీనియర్ కార్పొరేట్ కౌన్సిల్ ను సెలవుపై పంపింది.

ఇప్పటికే ఇన్ఫోసిస్ పై రాసిన కథనం వివాదాస్పదమైన తర్వాత అటు కేంద్రప్రభుత్వం, ఇటు ఆర్ఎస్ఎస్ ఆ పత్రికతో విభేదించాయి. ఆ కథనం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించగా.. ఆ పత్రికలోని వ్యాసాలతో తమ భావజాలానికి సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ వెల్లడించింది.
Tags:    

Similar News