క్రెడిట్టే కాదు...డెబిట్టూ తీసుకోవాల్సిందే...?

Update: 2022-04-22 23:30 GMT
రాజకీయాల్లో అంతా సెంట్రలైజ్డ్ అయిపోయింది. ఏది చేసినా ముఖ్యమంత్రే, ఏం ఇచ్చినా ప్రధానే. ఇలా వ్యక్తి పూజలు ఎక్కువైపోయాయి. దాని వల్ల క్రెడిట్ వస్తే సూపరే. అంతా ఫుల్ హ్యాపీస్ నే. కానీ ఎక్కడైనా తేడా వస్తే ఆ డెబిట్స్ ని కూడా తీసుకోవాలి. తప్పదు మరి. ఇదంతా ఎందుకంటే ఇపుడు ఈ డెబిట్స్ ఎక్కువైపోయి నేతాశ్రీలు తెగ ఇబ్బంది పడుతున్నారు. అయినా వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నారు.

ఉదాహరణకు తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు కారును ఎవరో తీసుకెళ్ళిన ఘటన మీద మండిపోయారు. మా తప్పేముంది, ప్రభుత్వానికీ కారు ఒక ఆర్టీయే కానిస్టేబుల్ తీసుకెళ్లడానికి సంబంధం ఏంటి అని కస్సుమన్నారు. నిజమే  చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దానికి జగన్ కి ఏమిటి సంబంధం. ముఖ్యమంత్రి ఎక్కడో ఉంటారు. వ్యవస్థలో నిత్యం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.

మరి ఎందుకు జగన్ని టార్గెట్ చేస్తున్నారు అంటే అక్కడే ఉంది తమాషా. ఇది నేతలు తాముగా తగిలించుకున్నదే. వార్డు కౌన్సిలర్ చేయాల్సిన పనులను కూడా వారే చేస్తున్నారు. వాలంటీర్ పెన్షన్ ఇస్తే అది జగన్ ఇచ్చాడు అని చెప్పుకుంటున్నారు. మరి అదే వార్డులో వీధిలో ఏదైనా గొడవ జరిగినా ప్రమాదం జరిగినా, అత్యాచారం జరిగినా మరే దోపిడీ జరిగినా కూడా పాలకుల మీదనే నేరుగా ఆరోపణలు వెళ్తున్నాయి.

వ్యవస్థ మొత్తాన్ని కేంద్రీకృతం చేసి నడిపిస్తున్న తీరు. పేరు కోసం పాకులాట మూలంగానే ఇలా జరుగుతోంది. ఇక లేటెస్ట్ గా విజయవాడలోని ఒక ప్రభుత్వ‌ ఆసుపత్రిలో మానసిక వికలాంగ యువతి మీద అత్యాచారం జరిగింది. ఇలాంటివి దారుణాతిదారుణం. దానికి స్థానికంగా ఉండే అధికారులు బాధ్యులు. వారే ఇలాంటివి అదుపు చేయాలి.

మరి విచ్చలవిడితనం పెరిగిపోవడం వల్లనే కదా ఇలా జరుగుతోంది. అందుకే టీడీపీ అయినా విపక్షాలు అయినా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. అప్పట్లో గుంటూరులో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు పసిబాలుడిని కొరికేసిన ఘటనను వైసీపీ విపక్షంలో ఉండగా సొమ్ము చేసుకుని నానా యాగీ చేసింది. అలాగే లోకల్ గా ఉండే కాల్ మనీ కేసులు అయినా మరోటి అయినా నాటి  సీఎం కి ఏంటి సంబంధం. అయినా బాబుని ఈ రోజుకీ అంటున్నారు.

దాంతో చంద్రబాబు సైతం ఇపుడు జగన్ దే అన్నింటికీ బాధ్యత అని అనాల్సి వస్తోంది. అన్ని అధికారాలు గుప్పిట పట్టి ఆఖరుకు మంత్రులను సైతం ఏమీ కాకుండా చేస్తున్న వ్యవస్థలో అవస్థలు అన్నీ కూడా ఏకంగా ముఖ్యమంత్రులే భరించాలి. అధికార వికేంద్రీకరణ చేస్తే కచ్చితంగా లోకల్ గా జరిగే వాటి మీద బాధ్యత ఉంటుంది. స్థానిక ప్రతినిధులు వాటి మీద నిఘా ఉంచుతారు. తప్పులు ఎక్కువగా జరగకుండా ఉంటాయి.

కానీ ఏది జరిగినా చంద్రబాబే. ఏం చేసినా జగనే. ఇలా పొగడ్తలకు అలవాటు పడి సర్వం తామే అనుకుంటున్న ప్రస్తుత వ్యవస్థల్లో నిందలూ వారే పడాల్సి ఉంటుంది. ఒకపుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కౌన్సిలర్ కి కూడా ఎంతో విలువ గౌరవం ఉండేది. నాడు ఇలాంటివి చాలా తక్కువ జరిగేవి. ఎందుకంటే లోకల్ గా ప్రజా వ్యవస్థలు బలంగా ఉండేవి. ఇపుడు ఎవరికి వారే యమునా తీరే. అంతా మా అధినాయకుడు చూసుకుంటాడు అని ఆలోచిస్తున్నారు. దాంతోనే ఈ తప్పులూ తిప్పలు.

అందువల్ల సజ్జల రామక్రిష్ణా రెడ్డి ఈ రోజు ఎక్కడో ఏదో జరిగితే సీఎం ని ఎందుకు అంటారు అని ప్రశ్నించవచ్చు కాక. మరి స్థానిక వ్యవస్థలను నిర్వీర్యం చేశాక ఎంతటి పెద్ద పదవి అయినా నామమాత్రం అయ్యాక నేరుగా పైవారికే ఈ సెగలూ పొగలూ తాకుతాయి. అలా కాకుండా ఉండాలంటే మళ్ళీ అధికార వికేంద్రీకరణ చేయాలి. సీఎం లెవెల్ లో తక్కువ జోక్యం ఉంటేనే బాధ్యత పెరుగుతుంది. అన్నీ సక్రమంగా ఉంటాయి. అయితే వ్యక్తిపూజలు త్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకు నేతాశ్రీలు సిద్ధమేనా.
Tags:    

Similar News